Congress : మౌత్ టాక్ మాత్రం అదుర్స్... ఎలక్షనీరింగ్ పైనే అనుమానాలు

తెలంగాణ ఎన్నికల్లో ఈసారి గెలుపుపై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పదేళ్ల తర్వాత అధికారం వస్తుందన్న నమ్మకంతో ఉంది

Update: 2023-11-23 13:54 GMT

తెలంగాణ ఎన్నికల్లో ఈసారి గెలుపుపై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పదేళ్ల తర్వాత చేతికి అధికారం వస్తుందన్న నమ్మకంతో ఉంది. జనంలో మార్పు వచ్చిందని భావిస్తుంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీయడంతో పాటు ఇక్కడ పదేళ్లుగా ఉన్న ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలసి వస్తుందని విశ్వాసంతో ఉంది. అందుకే టిక్కెట్ల కేటాయింపుల నుంచి ప్రచారం వరకూ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళుతుంది. గతం కంటే మెరుగ్గా కాంగ్రెస్ పరిస్థితి ఉందన్న సర్వేలు, అధికారానికి వస్తుందన్న నివేదికలు హస్తం పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అందరూ ఈసారి ఐక్యంగా కలసి ఎన్నికలు ఎదుర్కొంటుండటం సానుకూల పరిణామంగానే చూడాలి. కర్ణాటక తరహా గేమ్ ప్లాన్ ఇక్కడ కూడా అమలు పర్చడం కొంత కాంగ్రెస్ ను పుంజుకునేలా చేసింది.

కొన్ని వర్గాలలో...
ప్రధానంగా యువత, మహిళలు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎక్కువగా కనపరుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను ప్రచారంలోనూ ప్రశ్నిస్తుండటం ఇందుకు అద్దం పడుతుందని చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబంపై ఉన్న వ్యతిరేకతతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలన్న జనం అభిప్రాయం కూడా తమకు కలసి వచ్చే అంశంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక రాజస్థాన్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు హస్తం పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్న సర్వే నివేదికలు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. చివరకు ఏం జరుగుతుందన్నది తెలియకపోయినా కాంగ్రెస్ వేవ్ మాత్రం ఉందన్నది యదార్థం.
నినాదం ప్రజల్లోకి...
కాంగ్రెస్ ప్రచారంలోనూ ముందుంది. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, మ్యానిఫేస్టోలతో పాటుగా అధికార పార్టీపై చేసిన వీడియోలు జనాలను ఆకట్టుకుంటున్నాయి. జనం ఆసక్తిగా చూస్తున్నారు. "మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి"అన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అధికార పార్టీ వైఫల్యాలపై మొన్నటి వరకూ చూపించిన యాడ్స్ ప్రజలు ఆసక్తిగా గమనించి, ఆలోచించడానికి కారణమయ్యాయని చెప్పాలి. అటు అభ్యర్థుల ఎంపికలోనూ సర్వేల నివేదిక ఆధారంగానే చేయడంతో అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంది. సీపీఐ, తెలంగాణ జన సమితితో పొత్తు కూడా కాంగ్రెస్ కు కొంత కలసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 70 స్థానాల వరకూ వస్తాయన్న అంచనాలో ఉంది. వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా అదే చెబుతున్నారు.


బలాలు :
ఆరు గ్యారంటీలు
మ్యానిఫేస్టో
ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్న హామీ
నిరుద్యోగుల నుంచి మద్దతు
నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో బలంగా ఉండటం
దళిత, రెడ్డి సామాజికవర్గం ఓట్లు
రేవంత్ ప్రసంగాలు
రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటనలు
పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం హామీ
కీలక నేతలు పార్టీలో చేరిక
ఉద్యమ సంస్థలు, పౌరహక్కుల సంఘాలతో పాటు రైతు సంఘాల మద్దతు

బలహీనతలు :
ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం
రేవంత్ మూడు గంటల విద్యుత్తు కామెంట్స్
ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై క్లారిటీ లేకపోవడం
పోల్ మేనేజ్‌మెంట్ లో వెనకబడి ఉండటం
హైదరాబద్ తో పాటు నగరాల్లో అననుకూలత
కర్ణాటకలో గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ ప్రచారం


Tags:    

Similar News