తెలంగాణ ప్రజలకు సందేశాన్ని పంపిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ ఎన్నికలకు ముందు తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు సందేశం పంపారు. నవంబర్ 29న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు. మార్పు కోసం, కాంగ్రెస్‌కు ఓటు వేయాలని తెలంగాణలోని మా సోదరీమణులు, సోదరులు, కుమారులు, కుమార్తెలను అభ్యర్థిస్తున్నానన్నారు.
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావిస్తూ, పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిందని సోనియా గాంధీ చెప్పారు. నేను మీ వద్దకు రాలేకపోతున్నా. మీరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రజల తెలంగాణగా మార్చుకుందామని అన్నారు. తెలంగాణ ప్రజల స్వప్నాలు సాకారం కావాలన్నారు. సోనియమ్మ అంటూ నాపై ఎంతో ప్రేమ చూపారు. మీ ప్రేమ, అభిమానాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.
2014లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వరుసగా మూడవసారి అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. సోనియా గాంధీ ప్రస్తుతం జైపూర్ లో ఉన్నారు. సోనియా గాంధీ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులు ఆమెను తాత్కాలికంగా గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ప్రదేశానికి వెళ్లాలని కోరడంతో జైపూర్ కు చేరుకున్నారు సోనియా గాంధీ. ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆమె అక్కడే ఉండనున్నారు.