బీర్లు కేసులు కేసులు అమ్ముడుపోతున్నాయట

తెలంగాణలో బీర్ల అమ్మకాలు గత రెండు మూడు రోజుల నుంచి పెరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు

Update: 2023-10-12 04:32 GMT

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ప్రారంభమయింది. ఒక వైపు ఎన్నికల వీడి, మరో వైపు ఎండవేడిమి.. వెరసి తెలంగాణలో బీర్ల అమ్మకాలు గత రెండు మూడు రోజుల నుంచి పెరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉక్కపోత, ఎండవేడిమితో అల్లాడి పోతున్న జనానికి చల్లటి బీర్లు స్వాగతం పలుకుతున్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో విస్కీ, బ్రాందీ, రమ్ వంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని, అయితే ఎక్కువ మంది బీర్లను కొనుగోలు చేస్తుండటంతో వాటిని తెప్పించడం అసాధ్యంగా మారిందని మద్యం షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ కూడా ఎన్నికల సీజన్‌తో పాటు ఎండ వేడిమి కూడా ఎక్కువగా ఉండటంతో అత్యధిక సంఖ్యలో బీర్లను సరఫరా చేసేందుకు బ్రూవరీజ్ సంస్థలకు ఆర్డర్ ఇచ్చింది.

ఈ రెండు లేకుండా...
ఎన్నికలంటే డబ్బులు.. మద్యం. ఈ రెండు లేకుండా ఎన్నికలు జరగవు. ప్రచారం మొదలు పెట్టిన నాటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకూ మద్యం ఏరులై పారుతుంది. ఇది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. ప్రచారంలోనూ కార్యకర్తలను అధిక సంఖ్యలో తీసుకు రావాలన్నా, బహిరంగ సభలకు, ప్రదర్శనలకు జనాన్ని సమీకరించాలన్నా మద్యం ఇవ్వడం తప్పనిసరి. మద్యం బాటిల్‌తో పాటు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి మరికొంత నగదు ఇస్తేనే జనం వస్తారు. లేదంటే లేదు. ఏ పార్టీ అభ్యర్థికైనా ఈ ఖర్చు తప్పదు. ప్రచారంలో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత హైప్ వస్తుందని భావించి జనాన్ని పెద్ద సంఖ్యలో తీసుకు వస్తారు. వీరందరికీ ఉదయం నుంచి టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి మద్యం కూడా సరఫరా చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులందరూ...
బయట పనులకు పోయే వారు కూడా ఈ యాభై రోజుల్లో తక్కువగానే కనిపిస్తారు. అలా వెళ్లి శ్రమ చేయకుండా కూర్చుని వస్తే చాలు బీరు, బిర్యానీ, డబ్బులు చేతులో పడుతుండటంతో రోజువారీ పనులకు ఎవరు వెళతారు? ఇప్పుడు తెలంగాణలో అదే మొదలయింది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు అందరూ ప్రచారాన్ని ప్రారంభించారు. మిగిలిన పార్టీలకు చెందిన అగ్రనేతలు కూడా తెలంగాణకు వచ్చి సమావేశాలు పెడుతున్నారు. సభలు జరుపుతున్నారు. దీంతో మద్యం కేసులకొద్దీ అమ్ముడు పోతున్నాయి. ఈ రెండు నెలల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం అమ్మకాలు జరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకు తగినట్లుగా ఎక్సైజ్ శాఖ కూడా ఏర్పాట్లు చేస్తుంది.
ప్రీ ఆర్డర్లు...
మరోవైపు ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా కూడా సాధారణంగా బీర్ల విక్రయాలు పెరిగాయని మద్యం షాపుల యజమానులు చెబుతున్నారు. అంతేకాకుండా సామాజికపరమైన సమావేశాలు కూడా ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇందుకు కూడా మద్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. అందుకే మద్యం షాపుల నిర్వాహకులు ఎక్కువ స్టాక్ ను తెప్పించుకుని త్వరితగతిన సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు మద్యం షాపులకు ప్రీ ఆర్డర్లు ఇస్తున్నారని తెలియడంతో మరికొందరు ముందుగా అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ తమకు కావాల్సినంత మద్యాన్ని కొనుగోలు చేసేందుకు సరఫరా చేస్తున్నారు. సో.. ఈ యాభై రోజులు తాగినోళ్లకు తాగినంత. ఊగినోళ్లు.. ఊగినట్లే ఉంటారు. ఓట్ల పండగ పూర్తయ్యే వరకూ ఇదే పరిస్థిితి తెలంగాణలో తప్పదు.


Tags:    

Similar News