Etala rajender : ఈటల రెండు చోట్ల నుంచి పోటీకి అదే కారణం?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు

Update: 2023-10-22 12:49 GMT

బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేయనున్నారు. ఈ మేరకు అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. రెండు స్థానాల్లో ఈటల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఒక అభ్యర్థికి రెండు స్థానాలను కేటాయించడం, అసెంబ్లీ బరిలో ఇదే తెలంగాణ బీజేపీ చరిత్రలో తొలిసారి కావచ్చు. ఈటలకు అంత ప్రయారిటీ ఇవ్వడంపైన కూడా పార్టీలో చర్చ జరుగుతుంది.

కేసీఆర్ ఇలాకాలో...
ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి నుంచి ఈటల రాజేందర్ తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. తనకు తానే ప్రకటించుకున్నారు. ఈటల గజ్వేల్ నుంచి పోటీ చేస్తారని తెలిసే కేసీఆర్ కూడా ఈసారి రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఈసారి గజ్వేల్ నుంచి మాత్రమే కాకుండా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో మాత్రం బీజేపీ వెంకట రమణారెడ్డికి టిక్కెట్ కేటాయించింది.
ఏడు సార్లు గెలిచి...
ఈటలకు హుజూరాబాద్ కంచుకోట లాంటింది. ఆయన ఇప్పటి వరకూ ఏడు సార్లు విజయం సాధించారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన అధికార బీఆర్ఎస్ ఎంత ఖర్చు చేసినా తనదే పై చేయి అనిపించుకున్నారు. దాదాపు ఇరవై వేల ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ పై గెలుపొందారు. ఆ విజయం మామూలు విషయం కాదు. బీజేపీ తెలంగాణలో పుంజుకోవడానికి కారణమైన ఎన్నికగా దానిని ఇప్పటికీ పేర్కొంటారు. అలాంటిది ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయడం ఈటలకు ప్లస్సా? మైనస్సా? అన్న చర్చ జరుగుతుంది. గజ్వేల్ లో బీజేపీకి సరైన అభ్యర్థి లేక ఈటలను బీజేపీ అధినాయకత్వం బరిలోకి దించిందని చెబుతున్నారు.
నష‌్టమేనా?
గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ను హుజూరాబాద్ ప్రజలు మళ్లీ ఆదరిస్తారా? ఒకవేళ గజ్వేల్ లో గెలిస్తే ఈటల హుజూరాబాద్ ను వదిలేసుకుంటారని ప్రచారాన్ని బీఆర్ఎస్ ఇప్పటి నుంచే హుజూరాబాద్‌లో ప్రారంభించింది. ఇటు హుజూరాబాద్ ప్రజలు కాదనుకుని, అటు గజ్వేల్‌లో ఓటమి పాలయితే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఈటల అభిమానుల్లో నెలకొంది. ఈటల పెద్ద సాహసానికే ఒడిగట్టారని, ప్రజల మూడ్ ఎలా మారతుందో చెప్పలేమని అంటున్నారు మొత్తం మీద ఈటల రాజేందర్ రెండుచోట్ల బరిలోకి దిగడం పార్టీకి ప్రయోజనమేమో కాని, వ్యక్తిగతంగా ఈటలకు నష్టమేనన్న వాళ్ల శాతం ఎక్కువగా కనపడుతుంది.


Tags:    

Similar News