Telangana Elections : పార్టీ మారిన 14 మంది ఎమ్మెల్యేల ఫేట్ ఎలా ఉందంటే... ఇది చదవండి మరి

గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు పథ్నాలుగు మంది బీఆర్ఎస్ లో చేరారు. వీరిలో కొందరికి ఇబ్బంది తప్పదు

Update: 2023-11-21 07:38 GMT

తెలంగాణ ఎన్నికల్లో పోటీ నువ్వా? నేనా అన్నట్లు సాగుతుంది. ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్యనే ఉందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. అధికారంలోకి ఎవరు వచ్చినా తక్కువ స్థానాలతోనే వస్తారన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 2018 ఎన్నికలలో గెలిచి తిరిగి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి గెలుపోటములపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ లో గత ఎన్నికల్లో 19 మంది ఎమ్యెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలవగా అందులో పన్నెండు మంది అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్చేలు కూడా కారు పార్టీ కండువా కప్పేసుకున్నారు. పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేశారు.

ఒకపార్టీలో గెలిచి...
అయితే ఈసారి వీరి గెలుపోటములపై పెద్దయెత్తున బెట్టింగ్ లు కూడా మొదలయ్యాయి. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా వ్యవహరించి పార్టీ మారిన వాళ్లకు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. ఎక్కువగా ఖమ్మం జిల్లా నుంచే కాంగ్రెస్, టీడీపీ ల నుంచి ఎక్కువ మంది జంప్ చేసిన వారిలో ఉన్నారు. వీరంతా మరోసారి తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. అయితే పార్టీ మారడంతో ప్రజలు వీరికి మరోసారి పట్టం కడతారా? లేక పార్టీనే చూస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారినోళ్లందరూ కొంత కలవరంతోనే ఉన్నారు. పైగా అధికార పార్టీపై ఉన్న అసంతృప్తితో పాటు పార్టీ మారడం తమ గెలుపోటములపై ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం వారిలో కనిపిస్తుంది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే...
2018 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, ఆసిఫా బాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. వీరిలో సబిత ఇంద్రారెడ్డికి కేసీఆర్ మంత్రి వర్గంలో స్థానం లభించింది. ఇక ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులు టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎక్కువ మందికి ఇబ్బంది....
పార్టీ మారిన పన్నెండు మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు ఖమ్మం జిల్లాకు చెందిన వారే. అయితే ఈసారి వీరికి అంత సానుకూలత లేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పథ్నాలుగు నియోకవర్గాల్లో రెండు, మూడు మినహా మరెక్కడా ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని ప్రజలు అంగీకరించడం లేదు. పొరుగున ఉన్న ఏపీలో 2014లో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు అప్పటి అధికార పార్టీ టీడీపీలో చేరారు. అయితే వారిలో కొందరికి చంద్రబాబు అప్పుడు టిక్కెట్ ఇవ్వలేదు. టిక్కెట్ ఇచ్చిన వారిలో అద్దంకి నుంచి గొట్టి పాటి రవికుమార్ మినహా మరెవ్వరూ గెలవలేదని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి. అయితే వీరిలో కొందరు బలంగా ఉండటంతో గెలుస్తారన్న ధీమా బీఆర్ఎస్ లో వ్యక్తమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News