Telangana Elections : సికింద్రాబాద్ ఈసారి ముగ్గురిలో మొగ్గు ఎవరి వైపు అంటే?
సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ తో పాటు, కాంగ్రెస్, బీజేపీ కూడా బలంగానే ఉన్నాయి
తెలంగాణ ఎన్నికల్లో ఈసారి గెలుపోటములు దోబూచులాడుతున్నాయి. ఎవరిది విజయమో.. ఎవరిని అపజయం వెంటాడుతుందో తెలియని పరిస్థితి. వేవ్ ఉన్నట్లే కనిపిస్తున్నప్పటికీ సైలెంట్ ఓటింగ్ ఎవరి కొంపముంచుతుందన్న ఆందోళన అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ ఉంది. అదే ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రత్యేకత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరం ఎటు వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, బీజేపీ గణనీయమైన సంఖ్యలో కార్పొరేటర్లను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కు కేవలం ఒక్క స్థానం మాత్రమే వచ్చింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు వేరు. సాధారణ ఎన్నికల వేరు.
మూడు పార్టీలూ బలంగానే...
సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ తో పాటు, కాంగ్రెస్, బీజేపీ కూడా బలంగానే ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అదే లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి బీజేపీ విజయం సాధించింది. ఇలా ఎన్నికకు ఎన్నికకు ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని అనిపిస్తుంది. శాసనసభ ఎన్నికల్లో అయితే గత రెండు దఫాలుగా బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుస్తూ వస్తున్నారు. ఆయన మూడోసారి ముచ్చటగా గెలిచేందుకు శ్రమిస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ఆదం సంతోష్ కుమార్, బీజేపీ నుంచి మేకల సారంగపాణి బరిలో ఉన్నారు. ముగ్గురూ గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
హ్యాట్రిక్ కోసం...
2014, 2018 ఎన్నికల్లో వరసగా రెండు సార్లు గెలిచిన పద్మారావు గౌడ్ ఈ సారి విజయం తనదేనంటున్నారు. అయితే ఈసారి కొంత నగరంలో కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ పార్టీ అభ్యర్థి సంతోష్ కుమార్ చెబుతున్నారు. 2009లో ఇక్కడి నుంచి సినీనటి జయసుధ విజయం సాధించారు. క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ కుమార్ తన గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ సమస్యలను పట్టించుకోలేదని, తనను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తానని చెబుతున్నారు. ప్రధానంగా బస్తీలలో తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
విజయంపై ధీమా...
మరోవైపు బీజేపీ అభ్యర్థి కూడా విక్టరీ పై కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, ఎంపీగా, కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉండటం ఆయనకు కలసి వచ్చే అంశంగా ఆయన భావిస్తున్నారు. మాదిగ రిజర్వేషన్ల అంశంపై మోదీ ఇచ్చిన హామీ కూడా తనకు అనుకూలంగా మారుతుందని చెబుతున్నారు. ఇలా ముగ్గురు గెలుపుపై ధీమాగా ఉన్నారు. కానీ గెలుపు ఎవరిని వరిస్తుందనేది చివరి వరకూ చెప్పడం కష్టమేనంటున్నారు. క్రిస్టియన్ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపితే వారిదే గెలుపు అవుతుంది. అందుకే హామీలు ఇస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు ముగ్గురు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు.