Congress : పారాచూట్లకే టిక్కెట్లా? ఇదెక్కడి న్యాయం?
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెబల్స్ బెడద ఎక్కువయ్యే అవకాశముంది
కాంగ్రెస్ నేతల ఆందోళన తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. రెండు విడతలుగా వంద మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ రెండు జాబితాల్లో కొత్తగా చేరిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. అందుకే గాంధీభవన్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతి నేతలు బాహాటంగానే పార్టీపై విమర్శలు చేస్తున్నారు. టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే అందులో నిజానిజాలు ఎంత ఉన్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం రెండో జాబితా అనంతరం కొంత అసంతృప్తులతో తలనొప్పులు తెచ్చుకున్నట్లయింది.
ఇన్నాళ్లూ పార్టీ కోసం...
బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా దాదాపు తొమ్మిదేళ్ల పాటు పోరాటం చేసిన వారిని పక్కన పెట్టడమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. తమకు టిక్కెట్ వస్తుందన్న ఆశతోనే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ ఇన్నాళ్లు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు కృషి చేశామంటున్నారు నేతలు. సభలకు, సమావేశాలకు జనాలను, కార్యకర్తలను తరలించడానికి తమ ఆస్తులను కూడా కరిగించుకున్నామని లీడర్లు వాపోతున్నారు. తీరా ఎన్నికల సమయానికి వచ్చే సరికి తమకు సీటు ఇవ్వకుండా బలి చేశారని, త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం ఎంత మాత్రం సమంజసం కాదన్న కామెంట్స్ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
పార్టీని వీడే వారు...
టిక్కెట్లు దక్కని నేతలు కొందరు ఆగ్రహంతో బీఆర్ఎస్ లో చేరుతుంటే.. మరికొందరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. సర్వేల ప్రకారం, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించామన్నది అధిష్టానం నుంచి వినిపిస్తున్న వెర్షన్. ఈసారి కాంగ్రెస్ కు కొంత సానుకూల వాతావరణం ఉండటంతో టిక్కెట్ల కోసం పోటీ ఏర్పడిందని, అందరికీ టిక్కెట్లు ఇవ్వలేమని, అధికారంలోకి వచ్చిన తర్వాత నామనేటెడ్ పదవులు ఇస్తామని కొందరికి హామీలు ఇస్తూ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినా నేతలు మాత్రం ఆగడం లేదు. పార్టీని వీడేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కొందరు రెబల్స్ గా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు.
రెబల్స్ గా బరిలోకి దిగుతామని...
వీళ్లంతా ఎన్నికల సమయంలో పార్టీకి తలనొప్పిగా మారనున్నారు. ఏ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలు దెబ్బతింటాయని వారు అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ధీమాగానే కనిపిస్తుంది. ప్రజలు సింబల్ చూసి మాత్రమే ఓటు వేస్తారని, వ్యక్తులను చూసి ఓటేయరన్న నమ్మకంతో ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వడంతో ఇన్నాళ్లూ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారు మాత్రం రాజకీయంగా హస్తం పార్టీతో పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. మరో ఐదేళ్లు వేచి చూసే ఓపిక లేదని, ఈసారి తాడో పేడో తేల్చుకుంటామని అంటున్నారు. మరి రెబల్స్ బెడద నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలా బయటపడుతుందన్నది చూడాల్సి ఉంది.