Pawan Kalyan : భద్రత కావాలంటే.. మోదీ మళ్లీ రావాల్సిందే
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు రోడ్డు మీదకు వస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు
సకలజనుల సమ్మె చేస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు రోడ్డు మీదకు వస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఎల్.బి. స్టేడియంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ చేరాలన్న ఆకాంక్షగా తెలంగాణ ఏర్పడిందన్నారు. అయితే ఇవన్నీ తెలంగాణ ప్రజలకు చేరాయా? అన్నది ఆలోచించాలన్నారు. మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం దేశానికి ఎంత ఉపయోగపడిందో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దేశానికి ఒకబలమైన నాయకుడు కావాలని తాను కోరుకుంటానని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన దేశానికి ప్రధాని తర్వాత సుస్థిరత ఏర్పడిందన్నారు.
ఉగ్రదాడులను...
2014 నుంచి ఇప్పటి వరకూ ఉగ్రదాడులను ఎలా కట్టడి చేయగలిగారో అందరికీ తెలుసునన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యాన్ని నింపిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే చెల్లుతుందన్నారు. కరోనా సమయంలో వ్యాక్సినేషన్ చేయించిన విధానాన్ని కూడా కొనియాడకుండా ఉండలేమన్నారు. చాంద్రయాన్ 3 విజయవంతం అయ్యేందుకు పరోక్షంగా దోహదపడ్డారన్నారు. శాస్త్రవేత్తలను భుజం తట్టి ప్రోత్సహించారన్నారు. మూడు దశాబ్దాల పాటు రావాల్సిన ప్రగతిని కేవలం దశాబ్దకాలంలో చేసి చూపెట్టిన మోదీని పవన్ కల్యాణ‌్ ప్రశంసలతో ముంచెత్తారు.
బీసీని ముఖ్యమంత్రిని....
అత్యధిక శాతం ఈ దేశంలో బీసీలు జనాభా ఉన్నారని, బీసీలను ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించి బీజేపీ తెలంగాణ ఎన్నికలకు వెళుతుందన్నారు. తెలంగాణ అంటే పోరాటాల గడ్డ అని, బతుకు భారం కాకూడదని, సామాజిక తెలంగాణ రావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. అందుకు జనసేన మద్దతు బీజేపీకి ఉంటుందన్నారు. మూడోసారి ప్రధాని కావాలని తాను బలంగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. భద్రత కావాలంటే మోదీ రావాలన్నారు. తాము కూడా బీజేపీతో కలసి పోటీ చేసేందుకు అవకాశమిచ్చిన నేతలందరికీ ధన్యవాదాలు అన్నారు. తనకు ఇష్టమైన నేత, అన్న గా భావించే నరేంద్ర మోదీ మరోసారి ఆయన ప్రధాని కావాలని కోరారు.