Karimnagar : మూడుసార్లు గెలిచి ఒకరు.. రెండు సార్లు ఓడి మరొకరు.. ఈసారి మాత్రం
కరీంనగర్ నియోజకవర్గం ఎన్నిక ఈసారి ఆసక్తికరంగా మారింది. పైకి త్రిముఖ పోటీలా కనిపిస్తున్నా ద్విముఖ పోటీ నెలకొంది.
కరీంనగర్ నియోజకవర్గం ఎన్నిక ఈసారి ఆసక్తికరంగా మారింది. పైకి త్రిముఖ పోటీలా కనిపిస్తున్నప్పటికీ రెండు పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ఉందన్నది వాస్తవం. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బరిలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ తరుపున మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు. ఈసారి గెలుపోటములను అంచనా వేయడం కష్టంగానే ఉంది. గంగులకు ఛాన్స్ ఉందని కొన్ని విశ్లేషణలు వెలువడుతుండగా... లేదు..లేదు బండి సంజయ్ గెలుపు ఖాయమని మరికొన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. అందుకే ఇది తెలంగాణ ఎన్నికల్లోనే హాట్ సీటుగా మారిందని చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పురుమళ్ల శ్రీనివాస్ బరిలో ఉన్నారు.
హ్యాట్రిక్ కొట్టి....
మంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఆయన వరసగా గెలిచారు. అంటే పదిహేనేళ్ల నుంచి ఆయన కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గంగుల కమలాకర్ తర్వాత 2014లో బీఆర్ఎస్ లో చేరి పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. నాలుగోసారి గెలుపు కోసం ఆయన శ్రమిస్తారు. 2014, 2018 ఎన్నికల్లో గంగుల కమలాకర్ పై ఓటమి పాలయింది బండి సంజయ్ కావడం విశేషం. బండి సంజయ్ ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
సెంటిమెంట్‌తో కొడుతూ...
గంగుల కమలాకర్ పై సహజంగా ఉన్న అసంతృప్తి ఆయనకు కొంత ఇబ్బంది కలగనుంది. ఒక్కసారి అసెంబ్లీకి బండి సంజయ్ ను పంపి చూద్దామని కూడా భావించే వారు అనేక మంది ఉన్నారన్నది సర్వేల సారాంశం. దీంతోపాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బండి సంజయ్ 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కరీంనగర్ లోనే లక్ష మెజారిటీని సాధించారు. దీంతో ఈసారి తన గెలుపు ఖాయమని బండి సంజయ్ విశ్వాసంతో ఉన్నారు. తనను ఒకసారి అసెంబ్లీకి పంపాలని కూడా బండి సంజయ్ తన ప్రచారంలో పదే పదే కోరుతూ సెంటిమెంట్ ను పుట్టిస్తున్నారు.
ముగ్గురిలోనూ...
అంతే కాకుండా కరీంనగర్ పార్లమెంటుకు ఎన్నికయిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. అది కూడా ఆయనకు ప్లస్ కానుందని చెబుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినా జాతీయ పదవి ఇవ్వడంతో బండిని పంపితే తమ కరీంనగర్ పేరు దేశ వ్యాప్తంగా మోగిపోతుందని జనం భావించే అవకాశముందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. గంగుల కమలాకర్ కూడా అన్ని రకాలుగా బలంగా ఉన్నారు. ఆర్థికంగా మాత్రమే కాకుండా పార్టీ పరంగా ఓటు బ్యాంకుతో పాటు తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్ కూడా తన గెలుపు నల్లేరు నడక అంటున్నారు. ఇద్దరు ఓట్లు చీల్చుకుంటే తాను గెలుస్తానని అంటున్నారు. అందరూ మున్నూరు కాపులే కావడంతో ఎవరు గెలుస్తారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. హాట్ స్వీట్ ఎవరికి స్వీటు అన్న చర్చ జరుగుతుంది.