KCR : హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టింది..అందుకే మరోసారి గెలిపించండి

తెలంగాణ హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు;

Update: 2023-11-14 11:39 GMT

తెలంగాణ హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో నేతలు కాదు ప్రజలు గెలవాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపామన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తీసుకు వచ్చామన్నారు. రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఒక రాష్ట్రమైనా, దేశమైనా బాగుపడిందా? చెడిందా? అని చూడటానికి గీటురాయి ఉంటుందన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం ఎంత అనేది చూస్తారన్నారు. ఇప్పుడు ఈ రెండింటిలో తెలంగాణ నెంబరు వన్ గా ఉందని ఆయన తెలిపారు.

ఓటు వేసే ముందు...
ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పింఛన్ల సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఇచ్చే మొత్తాన్ని విడతల వారీగా ఐదు వేలకు తీసుకెళతామని తెలిపారు. రంగారెడ్డి , మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాలకు కృష్ణా నదీజలాలు తెస్తామని తెలిపారు. ఇందుకోసం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెడితే 162 కేసులు వేసి కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని, త్వరలోనే ఇక్కడకు కృష్ణా జలాలు వస్తాయని తెలిపారు. లక్ష ఎకరాలకు ఇబ్రహీంపట్నంలో సాగునీరు లభిస్తుందన్నారు. వ్యవసాయ స్థిరీకరణ జరగాలన్నారు. రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
వ్యవసాయం స్థిరీకరణ...
ప్రభుత్వం మద్దతు లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు కూడా ఇక రాదని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ ఉన్నందునే మీ ఖాతాల్లో నేరుగా డబ్బులు వచ్చి పడుతున్నాయన్నారు. నాణ్యమైన విద్యుత్తును 24 గంటల సరఫరా చేస్తున్నామని తెలిపారు. నీటి తీరువా వసూలు చేయడం లేదని, రైతు బీమా కూడా అందచేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ వస్తే పాత పద్ధతి వస్తుందని, మళ్లీ లంచాలు తప్పదని ఆయన ప్రజలను హెచ్చరించారు. అందుకే ఎవరూ ఆగమాగం కావద్దని, ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. మరోసారి మంచిరెడ్డి కిషన్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ కోరారు.
Tags:    

Similar News