Barrelakka : టెన్షన్ పెడుతున్న బర్రెలక్క... బతిమాలలేరు... బెదిరించనూ లేరు

మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం ఇప్పుడు బర్రెలక్క అలియాస్ శిరీష ప్రధాన పార్టీల అభ్యర్థులను భయపెడుతోంది

Update: 2023-11-24 06:12 GMT

తెలంగాణలో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తుండటం అందుకు కారణం. చైతన్యవంతమైన రాష్ట్రం కావడంతో పార్టీకన్నా, గుర్తుల కన్నా, వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో గత ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థుల విజయం సాధించారు. అంతే కాదు 119 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు పోలయిన ఓట్ల శాతాన్ని చూసి ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి దిగిన అభ్యర్థులకు 6.7 శాతం ఓట్లు పోలయ్యాయంటే వారిని తక్కువగా చూడలేని పరిస్థితి. ప్రజలు కూడా వారిని అక్కున చేర్చుకుంటున్నారన్న విషయం అర్థమయింది.

ఒక్కసారి ఫేమస్ అయి....
మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం ఇప్పుడు బర్రెలక్క అలియాస్ శిరీష కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. బర్రెలక్క అంటే సామాన్య యువత. బర్రెలు కాచుకుంటూ ఒక వీడియో తీసి పోస్టు చేయడంతో ఆమె ఫేమస్ అయింది. నిరుద్యోగంపై ఆమె చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతిస్తున్నారు. మేధావుల నుంచి సినీ పరిశ్రమ వరకూ.. సామాన్యుల నుంచి యువకుల వరకూ బర్రెలక్కకే తమ మద్దతు అంటూ బాహాటంగా ప్రకటిస్తుండటం ప్రధాన పార్టీలకు మింగుడుపడటం లేదు. ఆమె చేత నామినేషన్ విత్ డ్రా చేయించాలన్న ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో ఇప్పుడు తెలంగాణ మాత్రమే కాదు ఏపీలోనూ బర్రెలక్క గురించి చర్చ జరుగుతుందంటే అతిశయోక్తి కాదు.
స్వతంత్రులు గెలిచిన....
కొల్లాపూర్ నియోజకవర్గంలో గతంలో స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన చరిత్ర ఉంది. 1957 నుంచి ఇప్పటి వరకూ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 1967 బి నారాయణరెడ్డి, 1972 రంగదాస్, 1999లో మధుసూదన్ రావులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బర్రెలక్క టెన్షన్ పట్టుకుంది. అధికార పార్టీ ఓట్లను చీలుస్తుందేమోనన్న టెన్సన్ ఆ పార్టీకి ఉండగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే తాము నష్టపోతామేమోనని కాంగ్రెస్ అభ్యర్థికి బెంగ మొదలయింది. అలా ఇద్దరు నేతలను బర్రెలక్క టెన్షన్ పెడుతుంది. నిరుద్యోగ యువత ఆమెకు అండగా నిలబడుతుండటంతో ప్రచారంలో కూడా ఆమె దూసుకు వెళుతుంది.
సగం గెలిచినట్లే....
డబ్బులు లేకపోయినా ప్రచారాన్ని నిర్వహించకపోయినా బర్రెలక్క మాత్రం కొల్లాపూర్ లో ఇప్పడు ఎవరి ఓటమికి కారణమవుతారో? అన్న ఉత్కంఠ రాజకీయ నేతల్లో నెలకొంది. ధైర్యంగా ఒక యువతి అన్ని సవాళ్లను ఎదుర్కొని రాజకీయ నేతలను, పార్టీల బెదిరింపులకు లొంగకుండా పోటీలో ఉండటంతోనే సగం విజయం సాధించినట్లు విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ తరుపున జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీరం హర్షవర్థన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సుధాకర్ రావులు బరిలో ఉన్నారు. ఎక్కువసార్లు ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే.. బీఆర్ఎస్ మాత్రం ఒక్కసారి మాత్రమే విజయం సాధించడం విశేషం. మొత్తం మీద కొల్లాపూర్ లో మాత్రం బర్రెలక్క రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తుంది.


Tags:    

Similar News