Komatreddy: ఓసారి ఓటమి.. ఈసారి గెలుపునకు అవకాశాలున్నాయా?

కోమటిరెడ్డి బ్రదర్స్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఇద్దరూ ఒకసారి ఓటమి చవి చూశారు;

Update: 2023-11-18 07:43 GMT

కోమటిరెడ్డి బ్రదర్స్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఇద్దరూ ఒకసారి ఓటమి చవి చూశారు. 2018 సాధారణ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలయి ఆ తర్వాత భువనగిరి పార్లమెంటుకు పోటీ చేసి ఎన్నికయ్యారు. అలాగే ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయన మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచినా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఓటమి చవి చూసిన చోటు నుంచే మరొకసారి పోటీకి దిగుతున్నారు. ఈసారి గెలుస్తామన్న ధీమా వారిలో కనిపిస్తుంది. అయితే ప్రజానాడి ఎలా ఉంటుందోనన్న టెన్షన్ వారి అనుచరుల్లో నెలకొంది.

కాంగ్రెస్ లోనే ఉండి...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పాలనలో మంత్రిగా కూడా పనిచేశారు. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుంచి గెలుపొందారు. ఐదోసారి మాత్రం ఆయనకు ఓటమి ఎదురయింది. ఆయన 2018 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన అప్పట్లో షాక్ కు గురయ్యారు. ఆర్థికంగా, సామాజికపరంగా బలంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమిని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోయారు.
వేవ్‌తో పాటు...
వెనువెంటనే వచ్చిన భువనగిరి పార్లమెంటు నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో ఊరట లభించింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలోకి దిగారు. నల్లగొండ శాసనసభ నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థి కూడా మారలేదు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల భూపాల్‌రెడ్డి ఈసారి కూడా ఉన్నాడు. అయితే ఈసారి పార్టీ వేవ్ తో పాటు అధికార బీఆర్ఎస్‌పై వ్యతిరేకత తనకు కలసి వస్తుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. ఆయనకు గెలిచే అవకాశముందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ప్రచారంలోనూ దూసుకు వెళుతున్నారు. ఈసారి తన విజయం ఖాయమని ఎప్పటికైనా కాంగ్రెస్ నుంచి తాను ముఖ్యమంత్రి అవుతానని కూడా ఆయన ప్రకటించడంతో అనుచరుల హంగామాకు ఇక తిరుగులేకుండా ఉంది.
కాంగ్రెస్ నుంచి గెలిచి... బీజేపీ నుంచి...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే జిల్లాలో ఉన్న మునుగోడు నుంచి 2018 లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దాదాపు ఇరవై వేల మెజారిటీతో విజయం సాధించారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ పై ఆగ్రహించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఉప ఎన్నిక వచ్చింది. 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో 11 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నాయి. దీంతో పాటు బీఆర్ఎస్ కు కమ్యునిస్టులు కూడా మద్దతు పలకడం, ఉప ఎన్నిక కావడంతో ఓటమి పాలయ్యారని ఆయన అనుచరులు మనసుకు సర్దిచెప్పుకున్నారు.
కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి...
మరోసారి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే మునుగోడు నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేసి మరీ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఆయన కాంగ్రెస్‌లోకి రావడంతో కీలక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిపోయారు. పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. మరోనేత చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో టిక్కెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరి పోటీకి దిగారు. దీంతో ఓట్లు చీలుతాయన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. అయితే నేతలు వెళ్లినంత మాత్రాన తమ బ్రాండ్ చాలునని, ఈసారి తమ గెలుపును ఎవరు ఆపలేమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మొత్తం మీద నల్లగొండ‌లోని రెండు నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపోటములపై భారీ ఎత్తున బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయనడంలో అతిశయోక్తి కాదు.


Tags:    

Similar News