Priyanka Gandhi : ఒక్కసారి వచ్చిపోమ్మా.. తమ నియోజకవర్గాలకు రావాలంటూ వినతులు

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం కోసం నేతలు క్యూ కడుతున్నారు

Update: 2023-11-25 04:42 GMT

ప్రియాంక గాంధీ అచ్చం ఇందిరాగాంధీని పోలి ఉంటుంది. ఆమెను చూసిన వాళ్లు ఎవరైనా అనుకునే తొలి మాట అదే. ఇందిరాగాంధీ ఈ తరానికి తెలయకపోవచ్చు. కానీ ఇందిర సాహసం.. ఎన్నికల ప్రసంగాలు విన్నవారికి ఆమె అంటే ప్రత్యేక అభిమానం. ప్రత్యేకంగా పేదలు "అమ్మ"గా పిలుచుకున్న తొలి నేత ఇందిరాగాంధీ. ఇందిర హఠాన్మరణంతో వారి కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టినా ఆయన సాంకేతిక పరంగా దేశాన్ని అభివృద్ధి చేశారని, కంప్యూటర్ల యుగం ఆయనతోనే దేశంలో ప్రారంభమయిందనే వాళ్లు లేకపోలేదు. అలాంటి నాయనమ్మ పోలికలున్న ప్రియాంక గాంధీ చాలా ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ జోక్యం లేదు.

కొన్నాళ్లు ఇంటికే...
అంటే ఎక్కడా కనిపించనూ లేదు. అలాంటి ప్రియాంక గాంధీ తన తల్లి సోనియా గాంధీ అస్వస్థతకు గురి కావడం, ఎన్నికలకు తన అవసరం ఉందని గుర్తించడంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ రాలేదు. తన సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీ తరుపున మాత్రమే అమేధీ, రాయబరేలీలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికే పరిమితమయ్యారు. అంతే తప్ప దేశంలో ఏ ఎన్నిక జరిగినా ఆమెకు సంబంధం లేనట్లే ఉన్నారు. కానీ ఇప్పుడు సోదరుడు రాహుల్ ఏకాకిగా మారడంతో గత ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిపోయారనే చెప్పాలి. అలాంటి ప్రియాంక గాంధీ సభలకు పెద్దయెత్తున ప్రజలు హాజరవుతున్నారు. ముఖ్యంగా యువత ఆమె ప్రసంగాలకు ముగ్దులవుతున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో...
కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో ప్రియాంక గాంధీ పాత్రను కాదనలేం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండగా జరిగిన ఎన్నికల్లోనూ ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరాం, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆమె ప్రచారం కూడా ఇందుకు ప్లస్ అయందని నేతలు నమ్ముతున్నారు. తమ నియోజకవర్గానికి ఒక్కసారి వచ్చిపోవాలని పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారంటే కొద్ది కాలంలోనే రాజకీయంగా రాటుదేలారు.
తెలంగాణ ఎన్నికల్లో....
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ప్రియాంక గాంధీ కీలకంగా మారారు. ఆమె ప్రచార సభలకు కావాల్సినంత మంది జనం. ఆమె నవ్వు, హావభావాలు అన్నీ ఇందిరమ్మను చూసి నట్లే ఉండటంతో ఎక్కువ మంది ఆమెను దగ్గరగా చూసేందుకు వస్తున్నారు. ప్రియాంక గాంధీ ప్రచారంతో తమ గ్రాఫ్ మరింత పెరిగిందని కాంగ్రెస్ అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇంకా ప్రచారానికి మూడు రోజులు సమయం ఉండటంతో ఒక్కసారి తమ నియోజకవర్గానికి వచ్చిపోమ్మా అంటూ వినతులను సమర్పించుకుంటున్నారు. మరి కర్ణాటక తరహాలో ప్రియాంక గాంధీ ప్రచారం హిట్ అవుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు.
Tags:    

Similar News