Telangana Elections : కండువాలు కప్పేస్తే.. కాసేపు ఆనందం.. వారికి అంత సీన్ లేదట
ఎన్నికలంటే నేతలు పార్టీలు మారడం సహజం. అయితే వారి వెంట ఓట్లన్నీ వస్తాయనుకోవడం భ్రమే అవుతుంది
ఎన్నికలంటే నేతలు పార్టీలు మారడం సహజం. తనకు టిక్కెట్ దక్కలేదనో.. మరేదో కారణం చూపి అధికార పార్టీ నుంచి విపక్ష పార్టీల వైపునకు.. అలాగే విపక్షాల నుంచి అధికార పార్టీ వైపు నేతలు జంప్ చేస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇది సహజంగా జరిగే పరిణామమే. కనిపించే సీనే. కానీ నేతలు మారినంత మాత్రాన గంపగుత్తగా వారి వెంట గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఈ పార్టీకి బదిలీ అవుతాయా? అంటే కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. నేతల ప్రయోజనాలు పొందిన పదుగురు మాత్రమే వారి వెంట నడుస్తారు తప్పించి.. గత ఎన్నికల్లో ఓట్లేసిన వారంతా ఈసారి పార్టీ మారినప్పుడల్లా ఆ పార్టీకే ఓటు వేస్తారనుకోవడం అత్యాశే అవుతుంది.
ఏదో వస్తుందని...
అయినా ఎన్నికల సమయంలో నేతలకు కండువా కప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేత చేరిన వెంటనే తమకు ఏదో జరిగిపోతుందని కాదు కానీ పార్టీకి కొంతవరకైనా బూస్ట్ వస్తుందని పార్టీల నాయకత్వం వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. వారి రాజకీయ భవిష్యత్ కు తాము భరోసా అంటూ రొటీన్ డైలాగులు చెబుతారు. ఇంకేముంది కండువా కప్పుకున్న నేతలు ఉబ్బితబ్బిబ్బయి అప్పటి వరకూ తాము ఉన్న పార్టీపై ఘాటు విమర్శలకు దిగుతారు. ఆ పార్టీలో ఉన్న లోటు పాట్లను బయటపెడతారు. అదే చేరిపించుకున్న పార్టీకి కావాల్సింది. కానీ ప్రజలు పార్టీ మారిన నేతల మాటలను ఏ మేరకు విశ్వసిస్తారన్నది మాత్రం పట్టించుకోరన్నది మాత్రం కాదనలేని వాస్తవం.
అన్నింటీకీ...
ఇది అన్ని పార్టీలకూ వర్తిస్తుంది. అది అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కైనా, విపక్షంలో ఉన్న కాంగ్రెస్ కైనా అంతే. నేతల వెంట ఓటు బ్యాంకు వస్తుందనుకుంటే పొరపాటే. కానీ బిల్డప్పులకు మాత్రం తక్కువేమీ లేదు. టిక్కెట్ లభించకపోతే వెంటనే జంప్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అని కూడా తెలియదు. పోనీ చేరిన పార్టీ అయినా తర్వాత కాలంలో ఏదైనా ప్రయారిటీ ఇస్తుందా? అంటే అనుమానమే. ఎందుకంటే ఇవి ఉప ఎన్నికలు కావు. సాధారణ ఎన్నికలు. ఇప్పుడు ఎవరు చేరినా ఆ పార్టీకి పెద్దగా కలసి వచ్చే అవకాశం లేదు.
విశ్లేషణలు ఇలా...
ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్నది దాదాపు 70 శాతం మంది డిసైడ్ అయిపోయి ఉంటారన్నది ఒక విశ్లేషణ. ఇంకో ఇరవై శాతం మంది తమకు ఇన్‌స్టెంట్ ప్రయోజనాలు పోలింగ్ కు ముందు లభిస్తే వారికే ఓటు వేస్తారు. మిగిలిన పదిశాతం ఓటర్లు పోలింగ్ రోజు డిసైడ్ చేసుకుంటారని గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి రకరకాల విశ్లేషణలు కనపడుతున్నాయి. ఒక నేత మారితే ఆ నేతకు చెందిన సామాజికవర్గం కూడా ఆయన వెంట రాదన్నది గత ఎన్నికల ఫలితాలు తేల్చాయి. కాబట్టి కండువాలు కప్పి కాసేపు ఆనందం పడితే పడొచ్చు కాని, నేతలకు మాత్రం అంత సీన్ లేదన్నది వాస్తవం. మరి ఫలితాల తర్వాత నిరాశ తప్ప మిగిలేదేమీ ఉండదు.