Puvvada Ajay : మంత్రిగారికి ఈసారి అంత సులువు కాదట.. రీజన్స్ ఇవే

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గెలుపు అంత సులువు కాదంటున్నారు

Update: 2023-10-27 04:37 GMT

ఒకసారి గెలుపు అంటే సంతోషం. రెండోసారి విజయం అంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ఇక హ్యాట్రిక్ విజయం అంత సులువు కాదు. ఎవరో నూటికి ఒకరో ఇద్దరో హ్యాట్రిక్ విజయాలను సాధిస్తారు. సహజంగా ఎమ్మెల్యేలపై ఉండే వ్యతిరేకత మూడోసారి ఇబ్బందిగా మారుతుంది. ప్రజల ఆలోచనల్లోనూ మార్పు వస్తుంది. ఈసారి మరొకరికి వేద్దామని ఎక్కువ మంది భావిస్తారు. తాము వేసుకున్న అంచనాల మేరకు నియోజకవర్గం అభివృద్ధి కాకపోవడం, అందుబాటులో ఉండకపోవడం, తమ సమస్యలు పరిష్కారం కాకపోవడం వంటివి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారుతుంది. గత ఎన్నికలలో ఓటమి పాలయిన వారికి సింపతీ కూడా తోడవుతుంది.

ఖమ్మం నియోజకవర్గంలో...
ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ పరిస్థితి కూడా అంతే. ఆయన ఈసారి గెలుపు అంత సులువు కాదన్న అంచనాలు వినపడుతున్నాయి. పువ్వాడ మీద ఉన్న వ్యతిరేకతతో పాటు రాజకీయ పరిణామాలు కూడా ఆయనకు కలసి వచ్చేట్లు లేవు. పువ్వాడ ఒకసారి కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లోకి వెళ్లారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మూడో సారి కూడా కారు పార్టీ నుంచే బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగే అవకాశముంది. ఇది కూడా ఆయన గెలుపునకు కొంత ఆటంకంగా ఏర్పడవచ్చు.
ఏపీ రాజకీయ పరిణామాలు...
ఖమ్మం జిల్లా అంటే ఆంధ్ర బోర్డర్. తెలంగాణలో ఉన్నప్పటికీ ఎక్కువగా ఆంధ్ర పాలిటిక్స్‌ ను ఫాలో అవుతుంటారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా పువ్వాడకు ఇబ్బందిగా మారతాయంటున్నారు. కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రత్యర్థిగా తుమ్మల దిగితే ఆయనకు కూడా సింహభాగం ఓట్లు షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో రెడ్డి సామాజికవర్గం ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి వైపు వస్తాయంటున్నారు. అదే జరిగితే తుమ్మల వర్సెస్ పువ్వాడల మధ్య పెద్దగా ఫైట్ లేకుండా ఏకపక్షంగా సాగేందుకే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు విశ్లేషకులు. కమ్మ సామాజికవర్గం ఓటర్లలో ఎక్కువగా తుమ్మలకు, ఆ తర్వాత నామా నాగేశ్వరరావుకే పడతాయని అంచనా వినిపిస్తుంది.
కమ్యునిస్టులు...
కమ్యునిస్టుల ప్రభావం కూడా ఇక్కడ ఎక్కువ. కాంగ్రెస్ తో జట్టుకట్టడంతో ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థికి కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. రెండుసార్లు వరసగా గెలవడం, మంత్రిగా ఆయన ఉండి అందుబాటులో ఉండకపోవడం వంటి కారణాలు పువ్వాడకు మైనస్ గా చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకూ బీఆర్ఎస్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఎక్కువగా కాంగ్రెస్, కమ్యునిస్టులు గెలిచారు. మరోవైపు సామాజికవర్గాల పరంగా కూడా పువ్వాడకు అంత కలసి రావడం లేదన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్న పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావుల మధ్య పోరు జరిగితే మాత్రం ఛాన్స్ అనేది అధికార పార్టీకి తక్కువేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News