Vijayasanthi : పేరులో ఉన్న రెండూ ఉండవా? ఇన్ని పార్టీలు మారితే ఫలితం ఉంటుందా?
సినీనటి విజయశాంతి మళ్లీ పార్టీ మారారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు
సినీనటి విజయశాంతి మళ్లీ పార్టీ మారారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. పార్టీలు మారడం ఆమె గతంలో సినిమాలకు కాల్‌షీట్లు ఇచ్చినంత తేలిగ్గా తీసుకుంటున్నారన్న కామెంట్స్ బాగా వినపడుతున్నాయి. సినిమాల్లో తన పేరులో ఉన్న విజయాన్ని సొంతం చేసుకున్న విజయశాంతి రాజకీయాల్లో మాత్రం సాధించుకోలేకపోయారు. 2009లో ఆమె మెదక్ నుంచి పార్లమెంటు సభ్యురాలిగా గెలిచారు. అదే ఆఖరి గెలుపు. ఆ తర్వాత ఇక పార్టీలు మారడం, కండువాలు మార్చడం అలవాటుగా మార్చుకున్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆమెకే తెలియనంతగా ఇన్ని సార్లు పార్టీలు మారారరంటే ఆశ్చర్యం పడనక్కరలేదు. ఆమెను చేర్చుకోవడం వల్ల విజయం ఉండదు.. అగ్రనేతలకు శాంతి ఉండదు అని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.
పార్టీలు మారుస్తూ...
ఏ రాజకీయ నేత ఇన్నిసార్లు పార్టీ మార్చి ఉండరు. విజయశాంతి తొలుత 1995లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ రాష‌్ట్ర సాధన కోసం 2005లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. తర్వాత 2009లో తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న కేసీఆర్ వెంట నడిచారు. కేసీఆర్ కు సోదరిగా ఆయనకు దగ్గరయ్యారు. 2009లో మెదక్ పార్లమెంటు స్థానం ఇవ్వడంతో ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పొసగక బయటకు వచ్చారు. కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ వద్ద చేరి వచ్చారు. పోనీలే ఇందులోనే కొనసాగుతారనుకుంటే ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు. బీజేపీలోనూ ఆమె ఇమడలేకపోయారు.
మళ్లీ కాంగ్రెస్ లోకి...
వెనువెంటనే మళ్లీ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇలా రాములమ్మ ఏ పార్టీలోనూ పట్టుమని పది నెలల పాటు ఉండలేదు. బీజేపీలో ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో పాటు వేదికపైకి తీసుకురావడంతో ఆమె హర్ట్ అయ్యారు. జనసేనతో పొత్తు కూడా ఆమెకు రుచించలేదు. దీంతో విజయశాంతి మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖర్గే చేత కండువా కప్పించుకున్నారు. ఆమెకు ప్రచార కమిటీ, ప్రణాళిక సంఘంలోనూ తీసుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయశాంతిని మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలు మరోసారి గాంధీ భవన్ లోకి అనుమతిచ్చారన్న ప్రచారం ఉంది.
చేర్చుకోవడం వల్ల...
కాంగ్రెస్ లో ఉన్ననాళ్లు ఆమె గాంధీ భవన్ లోకి అడుగుపెట్టడం అరుదు. విజయశాంతి చేరిక వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? అని నేతలను ప్రశ్నిస్తే పెదవి విరుపులు తప్పించి మరొకటి వినిపించడం లేదు. ఏదో చేర్చుకోవాని చేర్చుకున్నారు తప్పించి ఆమె చేరికతో ఓట్లు వచ్చి పడే అవకాశాలు లేవని పార్టీ నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వేళ గ్లామర్ కోసం తప్పించి ఆమెను చేర్చుకునడం వల్ల వేదికపై కుర్చీ ఒకటి భర్తీ అవుతుందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. ఇన్నిసార్లు పార్టీలు మారిన విజయశాంతి కేసీఆర్ ను ఓడించాలని కాంగ్రెస్ లో చేరినట్లు ప్రకటించారు. మరి ఈ సారైనా ఆమె కోరిక నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.