Janasena, Tdp : కమ్మ సామాజికవర్గానికి కాపు అసోసియేషన్ వార్నింగ్.. ఇక్కడ తమకు మద్దతివ్వకుంటే?
కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాపు వెల్ఫేర్ అసోసియేషన్ విడుదల చేసిన కరపత్రం కమ్మ సామాజికవర్గంలో కలకలం రేపుతుంది
తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. దీంతో ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారి ఓట్లు ఎటువైపు పడతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. టీడీపీ ఓట్లు కాంగ్రెస్ కు పడతాయని ఆ పార్టీ భావిస్తుండగా, తమకే ఎక్కువ మంది ఏపీ ఓటర్లు మొగ్గు చూపుతున్నారని బీఆర్ఎస్ అనుకుంటుంది. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయని కాంగ్రెస్ అంచనా వేసుకుంటే, దానికి, ఇక్కడ సమస్యలకు సంబంధం లేదని, బీఆర్ఎస్ వంటి సుస్థిర ప్రభుత్వానే ఏపీకి చెందిన అత్యధిక ఓటర్లు కోరుకుంటున్నారని ఆ పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు.
కూకట్ పల్లి నియోజకవర్గంలో...
అయితే కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎక్కువ మంది ఏపీ నుంచి వచ్చిన వారే ఉంటారు. దీనిని హైదరాబాద్‌లోని మరో కోనసీమ అని కూడా సరదాగా అంటుంటారు. అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు కాపు నేతలు కమ్మ నేతల మధ్య కో ఆర్డినేషన్ పై చర్చ జరుగుతుంది. కమ్మ సామాజికవర్గం ఓట్లు ఈసారి కాంగ్రెస్ కు పడతాయన్న ప్రచారం ఎక్కువగా ఉంది. చంద్రబాబును అరెస్ట్ చేస్తే తమకు ఇక్కడ ఆందోళన చేసుకునేందుకు కూడా అనుమతించలేదన్న ఆగ్రహం వారిలో కనిపిస్తుందంటున్నారు. కానీ కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన కూడా పోట ీచేస్తుంది. జనసేన నుంచి పోటీ చేసే ప్రేమకుమర్ కు కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎటుపడతాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.
కాపు వెల్ఫేర్ అసోసియేషన్...
ఈ నేపథ్యంలో కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. అందులో అభ్యర్థనతో పాటు సుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేసింది. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు టీడీపీ సంక్షోభంలోకి వెళ్లిపోయిన సందర్భంలో తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జైలుకు వెళ్లి పరామర్శించి బహిరంగంగా పొత్తును ప్రకటించారని గుర్తు చేశారు. దానివల్ల టీడీపీ గ్రాఫ్ పెరిగిందన్నారు. ఇప్పుడు ప్రేమ్ కుమార్ కు ఇక్కడ మద్దతిస్తేనే ఏపీలో తమ మద్దతు ఉంటుందని కూడా ఆ కరపత్రంలో హెచ్చరించారు. కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థికి మద్దతివ్వడం కనీస మీ బాధ్యత అని గుర్తు చేశారు. కూకట్ పల్లిలో మా అభ్యర్థి గెలుపే తమకు ముఖ్యమని అందుకు మీ సహకారం అవసరమని అభ్యర్థించారు.
ఇక్కడ మద్దతిస్తేనే...
అలా కాకుంటే ఏపీలో టీడీపీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను ఓడించే శక్తి తమకు ఉందని కూడా ఆ కరపత్రంలో కాపు వెల్ఫేర్ కమిటీ హెచ్చరించింది. ఇక్కడ జనసేన అభ్యర్థి గెలుపునకు మీరు కృషి చేయకపోతే అది మీకే నష్టమని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మనమంతా కలసి గెలవాలంటే ఇక్కడ మీ సహకారం అవసరమని కూడా పేర్కొంది. జనసేనకు కమ్మ సామాజికవర్గం మద్దతిచ్చేలా ఆ కుల పెద్దలు చర్యలు తీసుకోవాలంటూ కరపత్రంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కరపత్రం వైరల్ గా మారింది. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలకు జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముడిపెడుతూ వార్నింగ్ లతో రూపొందించిన ఈ కరపత్రం కూకట్ పల్లి నియోజకవర్గంలో కలకలం రేపుతుంది.