Revanth Reddy : డిసెంబరు 9న ప్రమాణస్వీకారమే
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబరు 9న ఎల్.బి స్టేడియంలో కాంగ్రెస్ ప్రమాణం ఉంటుందని ఆయన చెప్పారు. అచ్చంపేట సభలో ఆయన మాట్లాడారు. సీపీఐ, తెలంగాణ జనసమితి కాంగ్రెస్ కు మద్దతిస్తుందన్నారు. నిజాం నిరంకుశ పాలనను నుంచి విముక్తి పొందిన తర్వాత ఈ పాలమూరు జిల్లా బిడ్డా బూర్గుల రామకృష్ణారావు నాయకత్వం వహించారని, మళ్లీ ఇన్నేళ్లకు మీ నల్లమల బిడ్డకు అవకాశమిచ్చారని అన్నారు. రౌడీ మూక గువ్వల బాలరాజు దాడులు చేస్తుంటే ఓపికతో ఉన్నామన్నారు.
దాడులు తిప్పి కొట్టండి...
ఇకపై దాడులు తిప్పికొడదామని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. తొలి మంత్రివర్గంలోనే వాటికి ఆమోదం తెలుపుతామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని అన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయన్నారు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా ఎందుకు పరిశ్రమలు ఈ ప్రాంతానికి రాలేదన్నారు. నీళ్లు తేలేకపోయారన్నారు. అందుకే ఈసారి కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు. అచ్చంపేట్ నుంచి వంశీకృష్ణ యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారని అన్నారు.