Kothagudem : చివర వరకూ టెన్షన్ తప్పేట్లు లేదే... ఈవీఎంలు తెరిచే వరకూ గెలుపెవరిదో చెప్పలేం
కొత్తగూడెం రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. రెబల్స్ బరిలోకి దిగుతున్నారు
కొత్తగూడెం రాజకీయం రసకందాయంలో పడింది. హేమాహేమీలు బరిలోకి దిగారు. టిక్కెట్ దక్కిన వాళ్లు కొందరైతే.. రెబల్ అభ్యర్థులుగా మరికొందరు రంగంలో ఉండటంతో కొత్తగూడెం రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. కొత్తగూడెం ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం. అదే సమయంలో కమ్యునిస్టులకు కూడా కలసి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. మిగిలిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలే విజయం సాధించాయి. అలాంటి కొత్తగూడెం టిక్కెట్ కోసం చివరి వరకూ టిక్కెట్ కోసం వేచి చూసి రాదని తెలిసిన వారు నామినేషన్ వేయడంతో ఇప్పుడు ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్ టిక్కెట్ రాక...
కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనకు పార్టీ అధినాయకత్వం టిక్కెట్ ఖరారు చేయడంతో నామినేషన్ దాఖలు చేశారు. అయితే తనకు టిక్కెట్ వస్తుందని భావించిన జలగం వెంకట్రావు ఈరోజు నామినేషన్ ను దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు బరిలోకి దిగుతున్నారు. ఆయన దిగితే బీఆర్ఎస్ ఓట్లు చీలే అవకాశాలున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి. జలగం వెంకట్రావు 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2018 లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ లో చేరడంతో జలగంకు టికెట్ దక్కలేదు.
కాంగ్రెస్ టిక్కెట్ రాని...
దీంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన యడవల్లి కృష్ణ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు టిక్కెట్ దక్కలేదు. ఈ నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించింది. కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. దీంతో యడవల్లి కృష్ణ కూడా రెబల్ గా పోటీ చేస్తారంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కు కూడా కష్టమే. కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు కలిస్తే కొత్తగూడెంలో గెలుపు సులువుగా మారుతుంది. అలాగే బీఆర్ఎస్ కూడా ఇక్కడ బలంగానే ఉంది. అయితే రెబల్స్ కారణంగా రెండు పార్టీల అభ్యర్థులకు ఇబ్బందిగా మారనుంది. ఎవరిది గెలుపు అన్నది మాత్రం చివర వరకూ టెన్షన్ పెట్టక మానదు.
ఎవరిది గెలుపనేది?
కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఎవరిది గెలుపు అనేది చెప్పడం కష్టమే. ఒకరి ఓట్లు ఒకరు చీల్చుకునే అవకాశం ఇక్కడ కనపడుతుంది. వనమా వెంకటేశ్వరరావుపై మంచి అభిప్రాయం ఉన్నా ఆయన కుమారుడు ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని భావించిన ప్రజలు కొంత నెగిటివ్ గా ఉన్నారంటున్నారు. అదే సమయంలో జలగం బలగం కూడా తక్కువేమీ కాదు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా ఆయన బరిలోకి దిగుతున్నారు. మరోవైపు కమ్యునిస్టులు, కాంగ్రెస్ లు కలసి పోటీ చేయడం వల్ల కూనంనేనికి కూడా అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతోనే కొత్తగూడెం నియోజకవర్గంలో ఆసక్తికరపోరు నెలకొంది.