Ponnam Prabhakar : గెలుపు అవకాశాలున్నాయట.. అందుకే ఏరి కోరి?
కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ హుస్నా బాద్ లో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు
ఏ రాజకీయ నేతకైనా ఒకటే కల. శాసనసభ్యుడిని కావడం. పార్లమెంటు సభ్యత్వం కూడా పెద్దగా పట్టించుకోరు. ఎవరూ దానిని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. పార్లమెంటు సభ్యుడి హోదా తప్ప రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఉండదని భావిస్తారు. అందుకే ప్రతి ఒక్క రాజకీయ నేత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని తన లక్ష్యంగా పెట్టుకుంటారు. అందునా కొంత హైప్ ఉన్న పార్టీ అయితే మరీ ఎక్కువ ఉబలాటి పడిపోతారు. వీస్తున్న వేవ్ ప్రకారం ఆ పార్టీ తరుపున పోటీ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. టిక్కెట్ వస్తే గెలిచినంత ఆనందం. అందునా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీపై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా గ్రౌండ్ ఉంటుందన్న నమ్మకం. ఇప్పుడు కాంగ్రెస్ లో అదే జరుగుతుంది.
చిన్న వయసులోనే ఎంపీగా...
కాంగ్రెస్ లో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్. ఆయన చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. యువజన కాంగ్రెస్ లో ఉంటూ ఒక్కసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయిన ప్రభాకర్ కు తెలంగాణ విభజన సమస్య అప్పుడే వచ్చింది. ఆయన సమయంలోనే విభజన జరిగినా అందుకోసం పోరాటం చేయాల్సి వచ్చింది. హైకమాండ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించాల్సి వచ్చింది. చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ ఆయన 2014 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒకసారి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో నూ మరోసారి ఓటమి చవి చూశారు.
శాసనసభకు...
ఆయన కల శాసనసభలోకి అడుగు పెట్టాలని. ఇంతవరకూ నెరవేరలేదు. ఈసారి కాంగ్రెస్ కు కొంత అనుకూల పవనాలు వీస్తుండటంతో శాసనసభకు పోటీ చేసి అధికారంలోకి వస్తే మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్న నమ్మకంతో పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ కు ఇప్పుడు హుస్నాబాద్ స్థానం పార్టీ హైకమాండ్ కేటాయించింది. రెండో జాబితాలో ఆయన పేరును ప్రకటించింది. దీంతో ఆయన తెలంగాణ శాసనసభ ఎన్నిలకల్లో తొలిసారి బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గౌడ సామాజికవర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ అయితేనే హుస్నాబాద్ లో గెలిచే అవకాశాలున్నాయని సర్వే నివేదికలు కూడా రావడంతో ఆయనకే టిక్కెట్ దక్కింది.
గెలుపు అవకాశాలు...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫారాలను అందచేసిన తర్వాత తొలిసారి పర్యటించింది హుస్నాబాద్ లోనే. అక్కడ 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ విజయం సాధించారు. ఆయన హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం ఓట్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండటం, కమ్యునిస్టులు బలంగా ఉండటంతో పొన్నం ప్రభాకర్ గట్టి పోటీ ఇస్తారన్నది వాస్తవం. సీపీఐ మద్దతు కూడా ఆయనకు కలసి వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రెండుసార్లు గెలిచిన సతీష్ కుమార్ పై ఉండే వ్యతిరేకత ఎక్కువగా ఉంటే మాత్రం కేసీఆర్ సొంత జిల్లా అయిన సిద్ధపేటలో ఆయనను కొట్టే ఛాన్స్ ఉంది. అందుకే పొన్నంను అధినాయకత్వం బరిలోకి దింపింది. మరి పొన్నం తన కలను నెరవేర్చుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.