Serilingampally : జయం మాదే అంటున్న ముగ్గురూ.. ఈసారి గెలుపు ఎవరిదంటే?

శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్ మూడు ఎన్నికల్లో మూడు పార్టీలు గెలిచాయి.

Update: 2023-11-10 14:07 GMT

శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్ ఇలా మూడు ఎన్నికల్లో మూడు పార్టీలు గెలిచాయి. ఈసారి బీజేపీ కూడా రేసులో ఉంది. అంతేకాదు.. మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కువమంది ఉత్తర భారతీయ ఓటర్లున్న నియోజకవర్గమూ ఇదే. అందుకే ఈ నియోజకవర్గంలో గెలుపోటములను ముందుగా అంచనా వేయడం కష్టం. ఎందుకంటే ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది చెప్పలేని పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలూ బలంగానే ఉన్నాయి. అందుకే విశ్లేషకులకు సయితం ఈ నియోజకవర్గంలో గెలుపోటములపై ముందస్తు అంచనాలు వేయలేక పోతున్నారు.

మూడోసారి విజయం కోసం...
బీఆర్ఎస్ పార్టీ తరుపున మరోసారి ఆరికపూడి గాంధీ పోటీలో ఉన్నారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆయన బలవంతుడు. రెండుసార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. 2014 లో తెలుగుదేశం పార్టీ నుంచి, 2018 లో బీఆర్ఎస్ నుంచి ఆరికపూడి గాంధీ ఇక్కడ విజయం సాధించారు. అయితే రెండు సార్లు వరసగా గెలవడంతో సహజంగా ఉండే అసంతృప్తి ఆయనకు మైనస్ గా మారుతుందంటున్నారు. ఆయన హయాంలో అభివృద్ధి పనులు కొంత మేర జరిగినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నది ప్రజాభిప్రాయంగా వినిపిస్తుంది.
కిందిస్థాయి నుంచి...
ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా జగదీశ్వర్ గౌడ్ బరిలో ఉన్నారు. రాజకీయాల్లో ఆయన కిందిస్థాయి నుంచి ఎదిగారు. జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్ గా పనిచేశారు. నియోజకవర్గంలోని ప్రజలతో సంబంధాలు బాగున్నాయి. బంధువర్గం కూడా అధికంగానే ఉంది. అందుకే కాంగ్రెస్ సర్వేలు చేయించి మరీ చివరకు జగదీశ్వర్ గౌడ్ కు టిక్కెట్ కేటాయించింది. ఇక్కడ సెటిలర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఆంధ్ర, రాయలసీమకు చెందిన ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారి ఓట్లు తనకేనన్న నమ్మకంతో ఉన్నారు. టీడీపీ నుంచి కూడా తనకు పరోక్ష మద్దతు లభిస్తుందని జగదీశ్వర్ గౌడ్ భావిస్తున్నారు. అందుకే ఆయన గెలుపుపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు.
యువనేతగా...
బీజేపీ అభ్యర్థిగా రవికుమార్ యాదవ్ ఎన్నికల పోరులో నిలిచారు. ఆయన యువకుడు. విద్యావంతుడు. ఆయన తండ్రి బిక్షపతి యాదవ్ మాజీ శాసనసభ్యుడు. నియోజకవర్గం ఏర్పడిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన అందరికీ సుపరిచితుడు. బిక్షపతి యాదవ్ కు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయన తనయుడిగా రవికుమార్ యదవ్ యూత్ లీడర్ స్థాయి నుంచి ఎదిగి ఇప్పుడు శాసనసభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఉత్తర భారతీయులు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపుతారని, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశీస్సులు కూడా ఉండటంతో తన గెలుపు సునాయాసమని నమ్ముతున్నారు. పవన్ కల్యాణ్ కూడా ప్రచారానికి వచ్చే అవకాశముందంటున్నారు. జనసేన, బీజేపీలు రెండు ఈ టిక్కెట్ కోసం పోటీపడ్డాయి. చివరకు రవికుమార్ యాదవ్ ను బీజేపీ నాయకత్వం ఎంపిక చేసింది. పైగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆశీస్సులు కూడా రవికుమార్ యాదవ్ కు పుష్కలంగా ఉండటంతో గెలుపు తనదేనన్న విశ్వాసంతో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రవికుమార్ యాదవ్ యూత్ కూడా తనకు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నారు. ఇలా శేరిలింగంపల్లిలో ముగ్గురు అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడుతోంది.


Tags:    

Similar News