తుమ్మ ముల్లా? పువ్వాడ పువ్వా? పంచ్‌ డైలాగులతో ఖమ్మం రాజకీయాలు

తుమ్మ ముల్లా? పువ్వాడ పువ్వా? అక్కడ పంచ్‌ డైలాగులు పేలుతున్నాయ్‌. కౌంటర్లమీద కౌంటర్లు పడుతున్నాయ్‌. జిల్లా మంత్రి మైక్‌

Update: 2023-11-10 15:40 GMT

Telangana Assembly Election: తుమ్మ ముల్లా? పువ్వాడ పువ్వా? అక్కడ పంచ్‌ డైలాగులు పేలుతున్నాయ్‌. కౌంటర్లమీద కౌంటర్లు పడుతున్నాయ్‌. జిల్లా మంత్రి మైక్‌ పట్టుకున్నా, సీఎం స్టేజీ ఎక్కినా ఆ ఇద్దరే టార్గెట్‌. సీఎం కేసీఆర్‌ ఎక్కడ సభ నిర్వహించినా పంచ్‌ డైలాగులతో హోరెత్తిస్తున్నారు. గుచ్చుకునే తుమ్మముల్లు ఎందుకని కేసీఆర్‌ ప్రశ్నిస్తే.. పూజకు పనికిరాని పువ్వుకంటే ఈ తుమ్మే మేలు చేస్తుందని అవతలినుంచి కౌంటర్‌ ఇస్తున్నారు. ఖమ్మం గుమ్మంలో అదిరిపోయే స్పీచ్‌లతో దద్దరిల్లిపోతుంది.

తెలంగాణలో మిగిలిన జిల్లాలు ఒక ఎత్తయితే ఖమ్మం మరో ఎత్తు అన్నట్లు ఉంది తెలంగాణ రాజకీయాలు. జిల్లా లీడర్లయినా, పార్టీ అగ్రనేతలయినా అందరి దృష్టి ఇప్పుడు ఖమ్మంమీదే. తుమ్మల, పొంగులేటిలాంటి ముఖ్యనేతలు కండువాలు మార్చేయటంతో ఖమ్మాన్ని సవాల్‌గా తీసుకుంది బీఆర్‌ఎస్‌ పార్టీ. క్లీన్‌స్వీప్‌ టార్గెట్‌తో కాంగ్రెస్‌ దూకుడు పెంచటంతో ఖమ్మంలో డైలాగులు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లతో అదరగొడుతున్నారు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుమ్మలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తుమ్మ ముల్లు కావాలా..? పువ్వాడ పువ్వు కావాలా..? ఆలోచించి ఓటు వేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా కేసీఆర్‌ పంచ్‌ డైలాగులతో ఖమ్మం రాజకీయాలు మరింత హీటెక్కిపోతున్నాయి.

మాటల్లేవ్‌..మాట్లాడుకోవడల్లేవ్‌..

ఒకప్పుడూ ఒకే గూటి పక్షులు.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు. మాటల్లేవ్‌..మాట్లాడుకోవడల్లేవ్‌.. తూటాల్లాంటి మాటల యుద్ధం..సీఎం కేసీఆర్ విమర్శలే .. ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు తుమ్మల నాగేశ్వరరావు. నల్ల తుమ్మ పాటేస్కోని మరి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో ఉండగానే పువ్వాడతో తుమ్మలకి విభేదాలున్నాయి. ఇప్పుడు నువ్వా నేనా అంటూ ఖమ్మం అడ్డాగా సవాళ్లు రువ్వుకుంటున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా తుమ్మల ఎలాంటి ఆర్భాటాల్లేకుండా తొలిరేజే నామినేషన్‌ దాఖలు చేశారు. తర్వాత బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌, నామినేషన్‌ చేశారు.

ఆ పది సీట్లపై పార్టీల గురి

టోటల్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది సీట్లపై ఇటు బీఆర్‌ఎస్‌-అటు కాంగ్రెస్‌ గురిపెట్టాయి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పువ్వాడ- తుమ్మల మధ్య మాటల యుద్ధం పాట వరకు వెళ్లడమే కాదు. దొంగ ఓట్లు వ్యవహారంపై ఏకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు తుమ్మల. దీనిపై ఘాటుగా స్పందించారు పువ్వాడ అజయ్‌. తుమ్మలకు ఓటు వేసేవాళ్లకు ఓటు హక్కు ఉండాలా? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు కొందర్ని అడ్డంపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని తుమ్మలపై విమర్శలు కురిపించారు అజయ్‌. తనకు మంత్రి పదవి రాదనే అక్కసుతో బీఆర్‌ఎస్‌లో ఉండి కూడా తనను ఓడించాలని కుట్ర చేసిన వ్యక్తి తమ్ముల అని ఆరోపించారు.

Tags:    

Similar News