Assembly Elections: ఎన్నికల సమయంలో బైండోవర్ అంటే ఏమిటి?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో పది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అయితే కొన్ని రోజుల నుంచే..
తెలంగాణలో ఎన్నికలు పోలింగ్ మరింత దగ్గర పడింది. ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. అయితే కొన్ని రోజుల నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు మోహరించి ఉన్నాయి. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలు వచ్చాయంటే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత ఉంటుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక దృష్టి పెడతారు. రౌడీ షీటర్లు, గొడవలు సృష్టించే వారు.. ఏవైనా హింసాత్మక కేసులు ఉన్నవారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతుంటారు.
అలాంటి వారికి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. అయితే ఎన్నికల సమయంలో చాలా మందిని బైండోవర్ చేసినట్లు వింటూనే ఉంటాము. మరి బైండోవర్ అంటే ఏమిటి..? బైండోవర్ ఎవరిని చేస్తారు..? దీనిపై చాలా మందికి డౌన్ వస్తుంటుంది. మరి బైండోవర్ అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లను, బెల్టు దుకాణాలు నిర్వహించే వారితోపాటు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా, గొడవలు సృష్టించే వారిపై అనుమానాలు వచ్చినా? అలాంటి వ్యక్తులను పోలీసులు తహసీల్దార్ ఎదుట హాజరు పరుస్తారు. దీనినే బైండోవర్ అంటారు. ఇలా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విడుదల చేసేందుకు వారితో బాండ్ పేపర్ రాయించుకుంటారు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని బాండ్‌పై లిఖిత పూర్వక హామీతో సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేస్తారు పోలీసులు. ఈ ప్రక్రియను బైండోవర్ సత్ప్రవర్తనకు హామీ అంటారు. తహసీల్దార్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై రాత పూర్వకంగా ఇచ్చిన హామీని మితిమీరడమంటే చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.
బైండోవర్ సమయంలో నేర చరితులు, అనుమానితులు బాండ్‌లో రాసిచ్చిన హామీని అతిక్రమిస్తే దానిని బౌండ్ డౌన్ అంటారు. దీనిపై భారతీయ శిక్షాస్మృతి 107, 108, 109, 110 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. బైండోవర్ అయిన వ్యక్తి శిక్షను తప్పించుకునేందుకు పైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. ఇదంతా బౌండ్ డౌన్ చేసిన వారి వివరాలతో పోలీసులు నివేదికను తయారు చేస్తారు. ఇలా ఎన్నికల సమయంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇలాంటి వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని బైండోవర్ చేస్తుంటారు పోలీసులు.