భారీగా పట్టుబడుతున్న డబ్బు, మద్యం, నగలు.. ఎంతో తెలిస్తే..

తెలంగాణలో ఎన్నికల హడావుడి పెరిగిపోతుంటే.. మరో వైపు భారీ ఎత్తున డబ్బు,మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడికక్కడ భారీగా నగదు..

Update: 2023-10-26 04:38 GMT

తెలంగాణలో ఎన్నికల హడావుడి పెరిగిపోతుంటే.. మరో వైపు భారీ ఎత్తున డబ్బు,మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడికక్కడ భారీగా నగదు,మద్యం పట్టుబడుతున్నాయి. ఆధారాలు చూపని వాటిని పోలీసుల సీజ్‌ చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన నాటి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే పంపిస్తున్నారు. డబ్బును, మద్యాన్ని గుట్టచప్పుడు కాకుండా కొందరు తీసుకెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు పోలీసులకు చిక్కిపోతున్నారు. తెలంగాణలో నగదు, నగలు అడ్డగోలుగా ప్రవహిస్తున్నాయి. ప్రతి రోజు భారీ ఎత్తున క్యాష్‌, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, మద్యం సీజ్‌ చేస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటిదాకా సీజ్‌ చేసిందెంత? 340 కోట్లా? లేక కోటి 76 లక్షలేనా? అంత పట్టుబడితే ఇంత చూపించడం ఏంటి? దీనిపై ఈసీ ఏమంటోంది? దానికి ఐటీ ఏం క్లారిటీ ఇస్తోంది?

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ వచ్చాక.. ప్రతి రోజు భారీగా నగదు, నగలు, వెండి వస్తువులు పట్టుబడుతున్నాయి. ఇప్పటివరకు 340 కోట్ల రూపాయల విలువైన నగదు, నగలు సీజ్ చేశామంటున్నారు పోలీసులు. దీనిలో 119 కోట్ల 44 లక్షల రూపాయల నగదు ఉంటే, 156 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక 18 కోట్ల 67 లక్షల రూపాయల విలువైన మద్యం కూడా సీజ్‌ చేశారు. 16కోట్ల 94 లక్షల రూపాయల విలువైన మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటివరకు తాము సీజ్‌ చేసిన నగదు, నగలు..అన్నీ కలిపి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులకు అప్పగించారు పోలీసులు. వారి నివేదికలో ఇప్పటిదాకా పట్టుబడింది ఇంత అయితే.. ఇందులో కేవలం 1.76 కోట్ల రూపాయలకు సంబంధించి మాత్రమే ఎలాంటి వివరణ అందలేదంటున్నారు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డైరెక్టర్. పోలీసులకు పట్టుబడింది వందల కోట్లలో ఉంటే.. ఐటీ కేవలం 1.76 కోట్ల రూపాయలకు మాత్రమే వివరణ లేదు. అసలు పట్టుబడిందెంత? అందులో సక్రమ సొమ్మెంత? అక్రమంగా ఓటుకు నోటు కోసం తరలిస్తోందెంత అనే దానిపై గందరగోళం నెలకొంది.

ఎన్నికల వేళ తెలంగాణలోని 33 జిల్లాలలో ఐటీకి చెందిన క్విక్ రియాక్షన్ టీమ్స్ 24 గంటలు పనిచేస్తున్నాయి. తెలంగాణలో పట్టుబడుతున్న నగదు మొత్తం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులకే చేరుతుంది. ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 132 ప్రకారం ఐటి అధికారులు అక్రమంగా తరలిస్తున్న డబ్బును నేరుగా సీజ్ చేయవచ్చు. ఐటి యాక్ట్ సెక్షన్ 132 (ఏ) ప్రకారం పోలీసులు లేదా ఇతర ఏజెన్సీల నుంచి వచ్చిన నగదును ఐటి సీజ్ చేస్తుంది. పోలీసులకు తనిఖీల్లో దొరికిన నగదు, నగలను ఇన్కమ్ టాక్స్ అధికారులకు అందజేస్తారు. ఆ తర్వాత సంబంధిత వ్యక్తిని ఐటీ శాఖ విచారణకు పిలుస్తుంది. ఐటీ అధికారులు పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత ఆ నగదు అక్రమం అని తేలితే దాన్ని సీజ్ చేస్తారు. 

Tags:    

Similar News