ఏపీలో ఉన్నా పోయేదే... తెలంగాణలో ఇలా అయిందేంటబ్బా?
తెలంగాణలో టీడీపీ సీనియర్లు రాజకీయంగా ఇబ్బందులు పడుతుండగా ఏపీలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఒక ఊపు ఊపిన నేతలు అనుకుంటున్న మాట ఇది. తెలంగాణలో కీలక నేతలు కొందరు రాజకీయంగా కనుమరుగు కాగా, ఏపీలో మాత్రం ఇప్పటికీ కళకళలాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాజకీయంగా నష్టపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నారు. నాడు చంద్రబాబు మంత్రి వర్గంలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే నేతలు రాష్ట్రం ఆవిర్భావంతో ఎటూ కాకుండా పోయారు. ఏ పార్టీలోకి మారినా.. ఏ నిర్ణయం తీసుకున్నా వారికి కలసి రావడం లేదు. ఒకరో ఇద్దరికో మాత్రమే ఈ మినహాయింపు ఉంది.
కొందరికి మాత్రమే...
అలా మినహాయింపు ఉన్న వారిలో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారు కొందరే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి పదవి దక్కని ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మాత్రం మంత్రి పదవి దక్కింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నాటి తరం రాజకీయ నేతలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. టిక్కెట్ గ్యారంటీ మాత్రమే కాకుండా అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు అనేక మంది ఇప్పుడు తాము ఏపీ రాజకీయాల్లో ఉన్నా పోయేది అన్న సరదా కామెంట్స్ వినపడుతున్నాయి. అది సాధ్యం కాకపోయినా ఈ రకమైన చర్చ మాత్రం పార్టీలో జరుగుతుండటం విశేషం.
ఏపీలో మాత్రం ఇప్పటికీ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికీ యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అశోక్ గజపతి రాజు, మొన్నటి వరకూ కేఈ కృష్ణమూర్తి, దేవినేని కుటుంబం వంటి వారు ఇప్పటికీ ఎప్పటికప్పుడు వైల్డ్ కార్డు తరహాలో ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. వారు రాజకీయంగా పెద్దగా ఇబ్బంది పడటం లేదు. పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒకరూపంలో పదవి రావడం ఖాయంగా మారుతుంది. చంద్రబాబు అక్కడ ఉండటంతో ఆయన తనతో తొలి నుంచి ఉన్న వారిని వదిలి పెట్టకుండా తన వెంటే నడిచేలా చూసుకుంటున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ నేతలకు రాజకీయంగా రిటైర్‌మెంట్ లేకుండా పోయింది. అందుకే వారంతా ఖుషీగా ఉన్నారు.
ఇక్కడ రివర్స్‌లో...
కానీ తెలంగాణలో మాత్రం రివర్స్‌లో కనపడుతుంది. ఇక్కడ నేతలకు రాజకీయంగా భవిష్యత్ లేకుండా పోయింది. మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, నాగం జనార్ధన్ రెడ్డి వంటి సీనియర్లు మాత్రం ఇప్పుడు కనుమరుగు అవుతున్నారు. వారు ఎన్ని పార్టీలు మారినా ఫలితం కనిపించడం లేదు. నాడు టీడీపీలో చక్రం తిప్పిన తెలంగాణ నేతలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం చతికల పడ్డారు. తుమ్మలకు తొలినాళ్లలో మంత్రి పదవి లభించినా ఈసారి టిక్కెట్ కూడా దక్కని పరిస్థితి. మండవ వెంకటేశ్వరరావును ఏ పార్టీ నాయకత్వమూ పట్టించుకోవడం లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో రాజకీయంగా తలరాతలు మారిన నేతలు అనేక మంది ఇప్పుడు సతమతమవుతుండటం కనిపిస్తుంది. ఇక భవిష్యత్‌లోనూ వీరికి రాజకీయంగా ఎదుగుదల అసాధ్యమేనన్నది వాస్తవం.