ఇంద్రకీలే లో 700 ఏళ్ల నాటి ఇంద్రేశ్వరాలయ పునరుద్ధరణకు విజ్ఞప్తి
పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి, గ్రామస్తులకు 700 ఏళ్ల నాటి ఇంద్రేశ్వరాలయ పునరుద్ధరణకు విజ్ఞప్తి చేశారు.
తాండూర్, నవంబర్ 5: నాగర్ కర్నూల్ కు 8, తాండూర్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంద్రకీలే గ్రామ పొలాల్లో ఉన్న కాకతీయ కాలపు ఇంద్రేశ్వర ఆలయం శిథిలావస్థలో ఉందని, కాపాడుకొని భావితరాలకు అందించాలని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూల్ కు చెందిన ప్రముఖ కవులు ముచ్చర్ల దినకర్, వెదిరేపల్లి కాశన్నలు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన మంగళవారం ఇంద్రకీలే ఆలయాన్ని సందర్శించారు.
గర్భాలయం, అర్థమండపం, మహా మండపాలతో ఉన్న ఇంద్రేశ్వరాలయం 700 సంవత్సరాల నాటి కాకతీయ ఆలయ వాస్తు, శిల్పానికి అర్థం పడుతుందని, ఆలయం వెలుపల ద్వార శాఖలు, శివలింగం నాగదేవతలు, మహా మండపం లో రెండు నందులు, చక్కటి మహిషాసురమర్తిని శిల్పాలు నిర్లక్ష్యానికి నిలువుటాద్దాలని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ శిల్పాలను భద్రపరిచి, ఆలయాన్ని పునరుద్ధరించాలని శివనాగిరెడ్డి ఇంద్రకీలే గ్రామస్తులకు విన్నపం చేశారు. ఆలయం వెనక గల కోనేరు మరమ్మత్తులు చేసి గత వైభవాన్ని సంతరింజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముచ్చర్ల దినకర్ , వెదిరేపల్లి కాసన్న, తూము వెంకటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.