KTR : ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు;
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. గచ్చిబౌలి లోని ఆయన తన నివాసం నుంచి పది గంటలకు బయలుదేరిన కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో నేడు ఈడీ అధికారులు విచారించాలని నిర్ణయించి ఆయనకు ముందుగానే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి ఎందుకు నిధులను బదిలీ చేశారని ప్రశ్నించనున్నారు. న్యాయవాదులను మాత్రం అనుమతించలేదు.
భారీ బందోబస్తు....
కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వస్తుండటంతో ఉదయం నుంచే ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజానికి ఈ నెల 7వ తేదీన ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం కేటీఆర్ రావాల్సి ఉండగా, హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉండటంతో సమయం కోరారు. ఇందుకు ఈడీ అధికారుల అంగీకరించి నేడు విచారణకు రావాలని కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయనను నేడు సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈడీ కార్యాలయానికి వచ్చే దారులన్నీ మూసివేశారు. దీంతో నేడు ఈడీ విచారించి కేటీఆర్ ను వదిలేస్తుందా? లేక అరెస్ట్ చేస్తుందా? అన్న టెన్షన్ గులాబీ పార్టీ నేతల్లో ఉంది.