New Ration Cards: మీ రేషన్ కార్డు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది.;

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అర్హత గల వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. తొలుత గ్రామ సభల్లోనూ, ఆ తర్వాత మీ సేవా కేంద్రాల ద్వారా తెలుపు రంగు రేషన్ కార్డు కోసం లక్షలాది మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. కానీ దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా దాని స్టేటస్ మాత్రం తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమకు తెలుపు రంగు కార్డు ఈ ప్రభుత్వంలోనైనా వస్తుందా? రాదా? అన్న అనుమానంతో ప్రజలు ఉన్నారు. సంక్షేమ పథకాలు దక్కాలంటే తెలుపు రంగు రేషన్ కార్డు అవసరం కావడంతో వీటికి తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఏర్పడింది.
లక్షలాది మంది ఎదురు చూపులు...
గత పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో లబ్దిదారుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అందిన సమాచారం మేరకు ఆరు లక్షల మందికి పైగానే తెలుపు రంగు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. తెలుపు రంగు రేషన్ కార్డు వస్తే విద్య, వైద్యం విషయాల్లో నిర్భయంగా ఉండటమే కాకుండా ఉచిత విద్యుత్తు పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా లభిస్తుందని ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. తమ రేషన్ కార్డుల పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రజలు తిరిగి మీ సేవా కేంద్రాల వద్ద క్యూకడుతున్నారు. కానీ వారి నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
తెలుసుకోవాలంటే?
అయితే రేషన్ కార్డు స్టేటస్ ను తెలుసుకోవడానికి ప్రభుత్వం సులువైన పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇంట్లో ఉండే రేషన్ కార్డు స్టేటస్ ను తెలుసుకునే వీలుంది. ఫోన్ ద్వారానే స్టేటస్ ను తెలుసుకునే వీలుంది. ఫోన్ లో తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ అధికారిక వెబ్ సైట్ అయిన https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద కనిపించే రేషన్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో FSC Application Search చేస్తే మీ రేషన్ కార్డు స్టేటస్ తెలుస్తుంది. మీ సేవా అప్లికేషన్ నసెర్చ్ విండో ఓపన్ అవుతుంది. అందులో ముందుగా మీ జిల్లాను సెలెక్ట్ చేసుకుని మీ సేవా బాక్స్ పై అప్లికేషన్ నెంబర్ టైప్ చేసి క్లిక్ చేస్తే మీరు చేసిన దరఖాస్తు పరిశీలనలో ఉందా? లేదా రిజెక్ట్ అయిందా? అన్నది తెలుసుకోవచ్చు.