Telangana : మాఘ మాసం వచ్చిందోచ్.. కల్యాణ మస్తు లేటెస్ట్ అప్ డేట్ ఇదే
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేసింది.;

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేసింది. అయితే మరో కీలకమైన హామీ మాత్రం ఇంత వరకూ అమలుకు నోచుకోలేదు. అదే కల్యాణమస్తు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా ఈ హామీ మాత్రం అమలుకు నోచుకోలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే కల్యాణమస్తు పథకం కింద లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రజలకు వాగ్దానం చేశారు. ఈ హామీకి ప్రధానంగా మహిళలు అట్రాక్ట్ అయ్యారు. బంగారం అంటే మహిళలు ఎక్కువగా ఇష్టపడటంతో వారిని ఆకట్టుకునేందుకు ఈ హామీతో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది.
కల్యాణమస్తు పథకం కింద...
కల్యాణమస్తు పథకం కింద ఆడపిల్ల కుటుంబానికి లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించడంతో మహిళలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని, ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఆత్మీయ రైతు భరోసా నిధులను కూడా మహిళల ఖాతాల్లోనే వేస్తున్నారు. అయినా సరే ఏడాది గడిచినా వివాహ ముహూర్తాలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై విపక్షాలు నిలదీస్తున్నాయి. ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి అప్ డేట్ లేదు.
ఎంత వ్యయమవుతుందంటే?
అయితే ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ఏడాదికి 3,200 కోట్ల రూపాయలు ఈ పథకం అమలుకు అవసరమవుతాయని అంచనా వేస్తుంది. బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినా నిధుల లేమితో పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. 1,01,116 నగదుతో పాటు తులం బంగారం అంటే బంగారానికి మరో ఎనభై వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. గత బడ్జెట్ లో రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించినా అమలు చేయలేదు. ఏటా లక్షకు పైగానే దరఖాస్తులు వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయాలంటే నిధులు అవసరమవుతాయి. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు.
తమిళనాడులో అధ్యయనం తర్వాత...
మరోవైపు మాఘమాసం వచ్చేసింది. రేపటి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చే నెల 26 వ తేదీ వరకూ ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ నెల రోజుల్లో లక్షలాది పెళ్లిళ్లు జరుగుతాయి. అందులో అర్హులైన పేదలకు ఈ పథకం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. పేదింటికిచెందిన వారి పెళ్లిళ్లలో బంగారాన్ని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఇస్తుంది. తమిళనాడులో తెలంగాణ అధికారులు అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం నాలుగు సంక్షేమ పథకాలను ఈ నెల 26వ తేదీ నుంచి ప్రభుత్వం అమలు చేసింది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుండటంతో ఈ మాఘ మాసంలోనూ ఈ పథకం అమలు ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. అంత భారీ స్థాయిలో నిధులు వ్యయం చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని, పథకం మొదలు పెట్టామంటే ఏటా ఈ భారాన్ని మోయాల్సి వస్తుందన్న భావనతో వాయిదా వేస్తున్నట్లు తెలియవచ్చింది.