కేసీఆర్‌కు 'బలం' ఇచ్చింది మేమే : ఖర్గే

తెలంగాణ ఉద్యమం గుర్తు చేసుకుంటే దుఃఖం వస్తుందని కాంగ్రెస్ జాతీయాధ్య‌క్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Update: 2023-08-27 03:24 GMT

తెలంగాణ ఉద్యమం గుర్తు చేసుకుంటే దుఃఖం వస్తుందని కాంగ్రెస్ జాతీయాధ్య‌క్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. చేవెళ్ల ప్రజాగర్జన సభలో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నారు.. తెలంగాణ వల్ల ఒకే కుటుంబం లాభపడిందన్నారు. తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రం ఇచ్చారని.. తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్ కి ఎక్కడిది? కేసీఆర్ కి బలం ఇచ్చింది మేమే.. మాకు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ క్రెడిట్ అంతా నాదే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా నివాసానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన‌ట్లు గుర్తుచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచి తీరుతుందన్నారు. కర్ణాటకలో ఇచ్చిన వాగ్దానాలను అమలు పరుస్తున్నాం. తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామ‌న్నారు. సోనియా, రాహుల్ చెప్పిన మాటను అమలు పరచి చూపిస్తారన్నారు. కన్యాకుమారీ నుండి కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర చేశారు. అది కాంగ్రెస్ పార్టీ శక్తి అని కొనియాడారు.

రేపు తెలంగాణకి షా వస్తున్నారు. ఇన్ని ఎండ్లలో కాంగ్రెస్ ఎం చేసిందని అడుగుతాడు. కేసీఆర్ పార్టీకి బీజేపీతో అంతర్గత ఒప్పంది ఉందన్నారు. కేసీఆర్ బీజేపీని, బీజేపీ కేసీఆర్ ని అందుకే ఏం అనడం లేదన్నారు.

హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్ అని అన్నారు. మా పార్టీ నేతలు పటేల్, నెహ్రూ కలిసి హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిపారని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్.. ఐఐటీ, ఐఐఎం ఇచ్చింది కాంగ్రెస్.. కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ అడుగుతోందని మండిప‌డ్డారు. ఉమ్మడి ఏపీలో కట్టిన ప్రాజెక్టులన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.

కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సమయంలో అసలు కేసీఆర్ పార్టీ ఉందా? అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం లాక్కున్న ఎస్సీ ఎస్టీల భూములను తిరిగి వాళ్ళకే ఇస్తామ‌న్నారు. 26 పార్టీలు బీజేపీని గద్దె దించేందుకు సిద్ధమైతే కేసీఆర్ మాత్రం సైలెంట్ ఉన్నారని అన్నారు. కేసీఆర్ తనది సెక్యులర్ పార్టీ అంటాడు. బీజేపీకి మద్దతు ఇస్తాడని దుయ్య‌బ‌ట్టారు.

మా 26 పార్టీల లక్ష్యం బీజేపీని గద్దె దించడంతో పాటు.. బీజేపీకి మద్దతిచ్చే బీఆర్ఎస్ ని సైతం గద్దె దించడ‌మేన‌న్నారు. రాజ్యాంగం లేకపోతే నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవ్వకపోయేవాడినన్నారు. మేం అక్షరాస్యత పెంచడంపై దృష్టి పెట్టాం కాబట్టే.. మోదీ, షా , కేసీఆర్ చదువుకోగలిగారని అన్నారు. పిల్లల మరణాల రేటు గుజరాత్ లో ఎక్కువగా ఉందన్నారు.

కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నారు. నా దగ్గర రిపోర్ట్ కార్డ్ ఉంది. వచ్చి తీసుకెళ్లండని అన్నారు. రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టినా భయపడలేదన్నారు. మా దగ్గర రాహుల్ గాంధీ లాంటి నాయకులు ఉన్నారు. సీడబ్ల్యుసీ సభ్యులు మరింత పెరుగుతారు. వారిలో తెలంగాణ వారికి అవకాశాలు ఉంటాయి. సీడబ్ల్యూసీ లో ఉమ్మడి రాష్ట్రం నుండి ఒక్కరే ఉండేవారు. నేను వచ్చాక ఆరుగురికి ఛాన్స్ ఇచ్చానని తెలిపారు. సీడబ్ల్యూసీ లో 66 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారని వివ‌రించారు. రాష్ట్రంలో కేసీఆర్ ని.. దేశంలో మోదీని ఓడగొట్టండని స‌భా వేదిక నుంచి పిలుపునిచ్చారు.


Tags:    

Similar News