Heavy Rains : తెలంగాణలో వర్ష బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం
తెలంగాణలో భారీ వర్షం తో జనజీవనం అస్తవ్యస్థమయింది. అకాల వర్షంతో హైదరాబాద్ తో పాటు అనేక ప్రాంతాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి;

తెలంగాణలో భారీ వర్షం తో జనజీవనం అస్తవ్యస్థమయింది. అకాల వర్షంతో హైదరాబాద్ తో పాటు అనేక ప్రాంతాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. హైదరాబాద్ నగరంలో అయితే అనేక కాలనీలు నీట మునిగాయి. దాదాపు గంటన్నరకు పైగా కురిసిన వర్షానికి నాలాలు నిండి రహదారులపైకి నీళ్లు చేరాయి. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. నాలాలు పొంగి ప్రవహించడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు ఎవరూ మూతలు తెరవద్దని ఆదేశించారు. రహదారులు చెరువుల్లాగా మారడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఒక్కసారి తెలంగాణను కుదిపేసింది. నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం నమోదయింది.
అనేక ప్రాంతాలు.. నీట మునిగి...
ప్రధానంగా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరాయి. సికింద్రాబాద్ నంచి నారాయణగూడ వెళ్లే రహదారి, సచివాలయం వద్ద, ఖైరతాబాద్, ఎల్బీనగర్, పంజాగుట్ట, ఉప్పల్, తార్నాక వంటి ప్రాంతాల్లో రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విధుల నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో వర్షం కురవడంతో వాహనాల మీద వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక మంది వర్షంతో తడిసి ముద్దయ్యారు.
విద్యుత్తు సరఫరాకు...
హైదరాబాద్ లో కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు దాదాపు నాలుగు గంటల పాటు నిలిపేశారు. సాయంత్రం నాలుగు గంటలకు పోయిన విద్యుత్తు రాత్రి ఎనిమిది గంటలకు కాని రాలేదు. అనేక చోట్ల చెట్లు విరిగిపడటంతో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేకపోయినట్లు విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల వాహనాలు నీట మునిగిపోయాయి. దీంతో గంటసేపు ఈదురుగాలులతో కూడిన వర్షంతో తెలంగాణ తల్లడిల్లింది. అయితే వేసవిలో అకాల వర్షం అనేక మందికి ఎండల నుంచి ఉపశమనం కలిగించింది.