మునుగోడులో కాంగ్రెస్ ఛార్జిషీట్..కోమటిరెడ్డి డుమ్మా

మునుగోడు లో కాంగ్రెస్ టీఆర్ఎస్, బీజేపీలపై ఛార్జిషీట్ విడుదల చేసింది

Update: 2022-09-03 08:04 GMT

మునుగోడు లో కాంగ్రెస్ టీఆర్ఎస్, బీజేపీలపై ఛార్జిషీట్ విడుదల చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదని, పెట్రోలు, డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపించింది. గ్యాస్ సిలిండర్ ధర కాంగ్రెస్ హయాంలో రూ.400లు ఉంటే ఇప్పుడు రూ.1100లకు చేరిందన్నారు. అసంపూర్తిగా దిండి, చర్లగూడెం, కిష్టనాయనపల్లె ఎత్తిపోతల ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం వదిలేసిందన్నారు. ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వలేదన్నారు. చౌటుప్పల్ లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయలేదన్నారు.

పత్తా లేకుండా కేసీఆర్...
పోడు భూములకు పట్టాలిస్తామని పత్తా లేకుండా కేసీఆర్ పోయారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీని కూడా నెరవేర్చలేదని చెప్పారు. దళిత సీఎం, మూడెకరాల భూమి, కుటుంబానికి పది లక్షలంటూ దళితులను కేసీఆర్ దగా చేశారన్నారు. రైతులకు రుణ మాఫీ చేస్తామని చేయలేదన్నారు. రైతు వ్యతిరేక విధానాల వల్ల ఎనిమిది వేల మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారని ఛార్జిషీట్ లో ఆరోపించారు. ఏడు రకాల వస్తువులు రేషన్ ద్వారా ఇస్తున్న అమ్మ హస్తం పథకాన్ని కేసీఆర్ రద్దు చేశారన్నారు. కరెంటు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచారన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకపోగా నిరుద్యోగ భృతి కూడా కేసీఆర్ ప్రభుత్వం చెల్లించలేదన్నారు.
కోమటిరెడ్డి 22 వేల కోట్ల డీల్....
22 వేల కోట్ల రూపాయల డీల్ ను బీజేపీతో కుదుర్చుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను వంచించారన్నారు. ఎమ్మెల్యేగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. టీఆర్ఎస్ తో దోస్తీ చేసి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టు తెచ్చుకున్నారన్నారు. పింఛను రాని వారికి తన ఫౌండేషన్ ద్వారా ఇస్తానని మోసం చేశారన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయించకుంటే మళ్లీ ఓట్లు అడగనని చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్నారు. టీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంటే, బీజేపీ ప్రజలను మోసం చేసేందుకు మునుగోడు ప్రజల ముందుకు వస్తుందని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు వామపక్షాలు మద్దతు పలకడం దురదృష్టకరమని అన్నారు. అయితే ఈ సమావేశానికి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరయ్యారు. పీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags:    

Similar News