Rain Alert : మరో మూడు రోజులు భారీ వర్షాలు.. హై అలెర్ట్

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిసింది

Update: 2024-09-21 03:39 GMT

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిన్న రాత్రి హైదరాబాద్ లో రెండు గంటలకుపైగా కురిసిన వానతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. అనేక చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే శనివారం కావడంతో ఐటీ కంపెనీలకు సెలవు కావడంతో ఒకింత పోలీసులు వెంటనే ట్రాఫిక్ ను క్రమబద్దీకరించగలిగారు. రహదారులన్నీ జలమయమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అప్రమత్తమై అన్ని ఏర్పాట్లను ముందస్తుగా తీసుకున్నారు. ఈరోజు నుంచి కూడా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఎల్లో అలెర్ట్...
కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దంటూ వాతావరణ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు కూడా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 23వ తేదీ వరకూ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల పాటు ఎండ కాయడంతో కొంత ఊపిరిపీల్చుకున్న ప్రజలకు మళ్లీ వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుందని, ఎలాంటి ఇబ్బందులు పడవద్దని అధికారులు చెబుతున్నారు. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశముంది.


Tags:    

Similar News