Free Bus for Women : ఫ్రీ బస్సు భారంగా మారిందా? కార్మికుల సమ్మెకు కారణమదేనా?

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సుకు భారంగా మారిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి;

Update: 2025-01-28 12:24 GMT
labour unions, rtc strike, free bus for women,  telangana
  • whatsapp icon

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సుకు భారంగా మారిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. అనేక డిమాండ్లను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తున్నాయి. కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టినందునే తాము సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని చెబుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సమ్మె చేయడంతో ఆయన ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు తలొగ్గ లేదు. పైగా ఆర్టీసీపై కఠిన నిర్ణయం తీసుకుంటానని ప్రకటించడంతో పాటు యూనియన్లను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. దీనికి కారణం మహిళలకు ఉచిత బస్సు పథకమేనని కార్మిక సంఘాలు అంటున్నాయి.

హామీలు అమలు చేయకుండా...
తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అది ఆచరణలో అమలుకు నోచుకోలేదు. దాదాపు మూడున్నర లక్షల మంది వరకూ ఉన్న ఆర్టీసీ కార్మిక కుటుంబాలను మంచి చేసుకునేందుకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. అయితే రెండు పీఆర్సీలు ఇంత వరకూ చెల్లించలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనంచేయలేదు. సీసీఎస్, పీఎఫ్ డబ్బులు 2,700 కోట్ల చెల్లింపులు చేయడంతో పాటు ఇరవై ఏడురకాల తమ డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రయివేటు పరం చేయడాన్ని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై కూడా ఆర్టీసీ కార్మికసంఘాలు గుర్రుగా ఉన్నాయి.
ప్రధాన డిమాండ్లను...
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 జీతభత్యాల సవరణ, కండక్టర్‌ డ్రైవర్ల ఉద్యోగ భద్రత, విద్యుత్‌ బస్సులు ప్రభుత్వమే ఆర్టీసీ కొనుగోలు చేసి ఇవ్వాలన్నది కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లుగా వినిపిస్తున్నాయి. వీటిని పరిష్కరించకపోతే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి సమ్మెకు వెళతామని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి. అయితే ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు విధానంతోనే ఆర్టీసీ మరింత నష్టాల్లోకి వెళుతుందని, ప్రభుత్వం నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించాల్సి రావడంతో కార్మిక సంఘాల డిమాండ్లను పక్కన పెట్టిందని వారు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణలో సమ్మెనోటీసు ఇవ్వడంతో వారితో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. త్వరలోనే వారితో చర్చలు జరిపి సమ్మెను విరమింప చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించనుంది.


Tags:    

Similar News