SlBC Accident : టన్నెల్ లోకి ఆక్సిజన్.. సహాయక చర్యలు ముమ్మరం
శ్రీశైలం ఎడమకాల్వటన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.;

శ్రీశైలం ఎడమకాల్వ గట్టు ప్రమాదంలో సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. గత యాభై రెండు రోజులుగా శ్రీశైలం టన్నెల్ లో సహాయక చర్యలు జరుగుతున్నాయి. మృతదేహాలను వెలికి తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహాలు ఉన్న ప్రాంతంలో అతి ప్రమాదకరమైన పరిస్థితులు ఉండటంతో పాటు అక్కడ ఆక్సిజన్ కూడా అందకపోవడంతో తాజాగా అక్కడ ఆక్సిజన్ ను అందించడానికి వెంటిలేషన్ వ్యవస్థను పునరుద్ధరించారు. పేరుకుపోయిన మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.
ఆ ప్రాంతంలోనే...
గతంలో రెండు మృతదేహాలు లభ్యమయిన ప్రాంతంలోనే ఈ ఆరు మృతదేహాలు దొరికే అవకాశముందని భావించి అక్కడే తవ్వకాలు జరుపుతున్నారు. దాదాపు తొమ్మిది అడుగుల మేరకు పేరుకు పోయిన మట్టిని తవ్వేందుకు ఎస్కలేటర్లను ఉపయోగిస్తున్నారు. మట్టి తవ్వకాల కోసం ఐదు ఎస్కలేటర్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు. పన్నెండు సహాయక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. వీళ్లకు తోడుగా జిల్లా యంత్రాంగం కూడా అక్కడే తిష్ట వేసి వారికి అవసరమన సహాయక చర్యలను చేపడుతుంది.
మట్టిని తొలగించిన తర్వాతే...
సొరంగంలో ఉన్న మట్టిని పూర్తిగా తొలగిస్తేనే మృతదేహాల జాడ తెలియనుంది. మట్టిని తొలగించిన తర్వాతనే మృతదేహాల ఆచూకీ లభ్యమవుతుందని ప్రత్యేకఅధికారి శివశంకర్ తెలిపారు. అలాటే పై కప్పు నుంచి వస్తున్న నీటిని కూడా తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఆ నీటిని రాకుండా అడ్డుకట్ట వేయగలిగితే ప్రధాన సమస్య తీరినట్లేనని భావిస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందన్నది చెప్పలేమని, త్వరలోనే పూర్తి కావచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.