Revanth Reddy : తొమ్మిది అంశాలపై రేవంత్ నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు

Update: 2024-07-16 03:01 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. సచివాలయంలో నేడు మారథాన్ మీటింగ్ జరగనుంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్సీలతో సమావేశం కానున్నారు. కొత్తగా జిల్లాలకు నియమితులైన కలెక్టర్లు, ఎస్సీలతో ఆయన తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సమవేశంలో కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా తొమ్మిది అంశాలపై తమ ప్రభుత్వ విధానాలను కలెక్టర్లకు, ఎస్పీలకు రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ప్రభుత్వ పథకాలను కూడా అర్హులైన వారికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పనున్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలు....
వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, మహిళ శక్తి, వనమహోత్సవం, విద్య, శాంతిభద్రతలు, మాదకద్రవ్యాల నిర్మూలన, పాలన వంటి అంశాలపై అధికారులతో చర్చించునున్నారు. జిల్లాల్లో ప్రజలు నుంచి వచ్చే వినతులను తక్షణమే పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని కలెక్టర్లకు సూచించనున్నారు. ఇక భూవివాదాలతో ఇటీవల అనేక జిల్లాల్లో హత్యలు జరుగుతుండటంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాజీపడవద్దని ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రౌడీషీటర్ల విషయంలో ఎన్ని వత్తిడులు వచ్చినా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. ప్రధానంగా శాంతి భద్రతలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఎస్పీలకు తమ ప్రాధాన్యత ఏమిటో తెలియజేయనున్నారు.


Tags:    

Similar News