మూసీ ప్రాజెక్టు ఊసే ఈ మధ్య కాలంలో వినిపించడం లేదు. మూసీ నది ప్రక్షాళన చేపట్టాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేసింది. కొన్ని రోజులు జీహెచ్ఎంసీ అధికారులు హడావిడి చేశారు మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లకు నోటీసులు అందించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లేను ఖాళీ చేయించారు. వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించి అక్కడకు తరలించగలిగింది. ఇక ప్రాజెక్టు ఊపందుకుంటుందన్న సమయంలో కొద్ది రోజుల నుంచి ఆ ప్రాజెక్టు గురించి ఇటు అధికారులు కానీ, ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడంతో పాటు పూర్తి స్థాయిలో ఒకేసారి మూసీ నదీ పరివాహక ప్రాంతంలో నివాసాలను తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
ఆక్రమించుకుని నిర్మించిన…
మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తూ వస్తుంది. దీంతో కొత్త ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. పేదలయితే డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించడం ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే కొన్ని ప్రాంతాల్లో సొంత భవనాలను నిర్మించుకుని ఏళ్ల తరబడి నివాసముంటున్నారు. వారికి అన్ని అనుమతులున్నాయి. అలాంటి వారిని అక్కడి నుంచి వారి అనుమతితోనే భవనాలను కూల్చి వేయాలన్న ఆలోచనతో రేవంత్ సర్కార్ ఉన్నట్లు అధికారిక సమాచారం. కొత్త ఏడాదిలో మూసీ నది పునరుజ్జీవం పనులు ప్రారంభం చేసేందుకు సిద్ధమయ్యారు.
తాజా ప్రతిపాదనలివే…
ఇందుకోసం తొలి నాళ్లలో ప్రస్తుతముంటున్న భవనానికి సమీపంలోనే ప్రభుత్వ స్థలం ఉంటే రెండు వందల గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ మరో ప్రతిపాదన కూడా తెరమీదకు వచ్చింది. మూసీ నిర్వాసితులకు అండగా ఉండేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమయింది. అందులో భాగంగా భూసేకరణ చట్టంప్రకారం పరిహారంతో పాటు బాధితుల కోసం 15వేల ఇళ్లను కేటాయించనుంది. దీంతో పాటు బాధితులు ఇల్లు కట్టుకునేందుకు అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ 150 గజాల స్థలం ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనతో వస్తే నిర్వాసితులు అంగీకారం తెలిపే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొత్తం మీద మరికొన్ని రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును మళ్లీ యాక్టివ్ చేసి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాస భవనాలను కూల్చివేసే ప్రక్రియను ప్రారంభిస్తారని తెలిసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now