Telangana : ఒక బెడ్ పై ఇద్దరికి చికిత్స... పెరుగుతున్న డెంగ్యూ కేసులు

తెలంగాణలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి

Update: 2024-08-24 07:37 GMT

తెలంగాణలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఒక్కటి కాదు.. రెండు కాదు అన్ని ఆసుపత్రులూ రోగులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోనూ ఆసుపత్రులన్నీ ఫుల్లయ్యాయి. ఒక్కో బెడ్స్ పై ఇద్దరికీ చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, నిలోఫర్ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఎక్కువ మంది విషజ్వరాలు డెంగ్యూ కేసులతో ఇబ్బంది పడుతున్నారు.

అవుట్ పేషెంట్ విభాగంలోనూ...
దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయలేక వైద్యులు కూడా ఒక దశలో చేతులెత్తేసే పరిస్థిితి ఏర్పడింది. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి కూడా పెద్ద సంఖ్యలో రోగులు వచ్చారు. ఇక ప్రతి రోజూ అవుట్ పేషెంట్ విభాగం కూడా పెద్ద పెద్ద క్యూ లైన్లతో నిండిపోయింది. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం కష‌్టంగా మారుతుంది. కొందరికి రక్త పరీక్షలు తీసుకుని ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం ఇంటికి పంపుతున్నారు. బెడ్స్ ఖాళీలేవని చెబుతూ ఇంటికి వెళ్లి పొమ్మంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఇన్ పేషెంట్ గా చేర్చుకునే వీలు లేదని చెబుతుంటే ఆసుపత్రి సిబ్బందిపై రోగుల బంధువులు మండిపడుతున్నాు.
ఇప్పటి వరకూ నమోదయిన కేసులివే...
తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకూ 5,500 డెంగ్యూ కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. వీటిలో హైదరాబాద్ లోనే అత్యధికంగా 2,148 డెంగ్యూ కేసులున్నాయి. దోమల బెడద తీవ్రంగా ఉండటంతో విషజ్వరాలతో పాటు డెంగ్యూ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందకపోవడంతో విధిలేక చాలా మంది ప్రయివేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో విషజ్వరాలు జనాలను వణికిస్తుండగా, డెంగ్యూ తో అనేక మంది బాధపడుతున్నారు. డెంగ్యూ కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఇద్దరు మరణించారు.


Tags:    

Similar News