ఆళ్లగడ్డ ఎవరి అడ్డా...భూమా vs గంగుల
ఎలాగైనా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విజయం సాధించాలని అఖిలప్రియ పట్టుదలతో ఉన్నారు
ఎలాగైనా తన తల్లి విజయం సాధించిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విజయం సాధించాలని అఖిలప్రియ పట్టుదలతో ఉన్నారు. బంధుగణం ఎక్కువగా ఉండటంతో పాటు అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న కలిగి ఉన్న ఆళ్లగడ్డను వదిలేందుకు ఆమె ఇష్టపడటం లేదు. నంద్యాలకు వెళతారన్న ఊహాగానాలు ఆమె అనుచరులు కొట్టిపారేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆళ్లగడ్డ నుంచే పోటీ చేయడానికి అఖిలప్రియ సిద్ధమవుతున్నారు. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. అందుకే ఆమె ఆళ్లగడ్డలో మరింత బలం పెంచుకునేందుకు సిద్ధమయ్యారు.
సీన్ రివర్స్...
2014లో ఆళ్లగడ్డ, నంద్యాల రెండు సీట్లు భూమా కుటుంబం ఖాతాలోనే పడ్డాయి. ఆళ్లగడ్డ నుంచి భూమా శోభానాగిరెడ్డి, నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. శోభానాగిరెడ్డి మరణంతో ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి కూడా మరణించారు. భూమా కుటుంబం వైసీపీని వీడి టీడీపీలో చేరింది. దీంతో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి (భూమా నాగిరెడ్డి సోదరుడు కుమారుడు) శిల్పా మోహన్ రెడ్డి మీద విజయం సాధించారు.
మూడు దశాబ్దాల తర్వాత
అయితే 2019 లో జరిగిన ఎన్నికల్లో రెండు సీట్లను భూమా కుటుంబం కోల్పోయింది. ఆళ్లగడ్డలో గంగుల కుటుంబాన్ని రంగంలోకి దింపిన వైసీపీ విజయం సాధించింది. గంగుల కుటుంబం ఎప్పటి నుంచో ఆళ్లగడ్డపై పట్టు సాధించాలన్న ప్రయత్నంలో ఉంది. 1985లోనే గంగుల కుటుంబం ఆళ్లగడ్డ నుంచి గెలిచింది. ఆ తర్వాత 2019 వరకూ ఆ కుటుంబానికి గెలుపు పిలుపు వినిపించలేదు. మూడున్నర దశాబ్దాల తర్వాత గంగుల ఇంట్లో గెలుపు బాజాలు వినిపించాయి. గత ఎన్నికల్లో గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు. దీంతో పాటు అక్కడ అఖిలప్రియకు బంధువర్గమంతా దూరమయింది. ఆమె పెళ్లి తర్వాత బంధుగణంతో పాటు భూమా నాగిరెడ్డి అనుచరులు కూడా అఖిలప్రియకు దూరమయ్యారు. మంత్రి పదవిలో ఉన్నంతకాలం ఆమె లెక్క చేయకపోవడంతోనే ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
హోరా హోరీ....
ఇప్పుడు బంధుగణాన్ని తిరిగి తన దరిచేర్చుకుని పనిలో అఖిలప్రియ ఉన్నారు. దూరమయిపోయిన భూమా కిశోర్ రెడ్డి, భూమా మహేశ్వర్ రెడ్డి, భూమా వీరభద్రా రెడ్డిలను కూడా బుజ్జగిస్తున్నారని తెలిసింది. అవసరమైతే చంద్రబాబు చేత వారికి హామీ ఇప్పించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇక తన సోదరుడు జగద్విఖ్యాతరెడ్డితో భూ వివాదాలు తలెత్తినా వాటిని కూడా సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. గంగుల కుటుంబం కూడా ఆళ్లగడ్డపై పట్టు సాధించింది. ఈసారి ఆళ్లగడ్డలో ఇద్దరికీ గెలుపు ఆషామాషీ కాదు. ఎవరు గెలిచిన తక్కువ మెజారిటీతో గెలుస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పోరు హోరాహోరీ కొనసాగుతుంది. గంగుల కుటుంబం కూడా అన్ని రకాల వ్యూహాలతో సిద్ధంగా ఉంది. మరి చూడాలి ఈసారి గెలుపు ఎవరిదన్నది?