జగన్ కు ఆ భయం ఉందా?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం చర్చనీయాంశమైంది

Update: 2022-06-02 13:38 GMT

నిజమే.. పార్టీ నియమనిబంధనలను ఉల్లంఘించిన వారిని ఎవరినీ ఉపేక్షించకూడదు. ఎవరు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా ఉపేక్షించకూడదు. పార్టీ నాయకత్వం క్యాడర్ లో పలుచనగా మారుతుంది. కొత్తపల్లి సుబ్బరాయుడిపై వేటు వేయడం సరైన నిర్ణయమే. దానిని ఎవరూ కాదనలేరు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలి. అంతే తప్ప ప్రభుత్వ, పార్టీ నిర్ణయాలను తప్పు పడుతూ ఇబ్బందిగా మారితే పార్టీ నుంచి బయటకు పంపడమే మంచిది. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండకూడదు. అప్పుడే పార్టీ నాయకత్వంపై కిందిస్థాయిలో నమ్మకం ఏర్పడుతుంది.

కొత్తపల్లిపై వేటు వేసినంత...
కానీ కొత్తపల్లి సుబ్బారాయుడిపై వేటు వేసినంత సులువుగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వేయకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. గత రెండేళ్ల నుంచి రఘురామ కృష్ణరాజు పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగానే విమర్శిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకమైన మీడియాలో కూర్చుని వైసీపీ ప్రతినిధిగా ప్రభుత్వ వ్యవహారశైలిని, చివరకు నాయకుడి తీరును కూడా రఘురామ కృష్ణరాజు అనేక రోజులుగా విమర్శిస్తున్నారు. కానీ ఆయనపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయనపై స్పీకర్ కు అనర్హత వేటు వేయాలని కోరడం మినహాయించి రాజుగారిని పూర్తిగా బయటకు వదిలేశారు.
ఎందుకు తీసుకోనట్లు?
రఘురామ కృష్ణరాజు విషయంలో తీసుకోని చర్యలు కొత్తపల్లి సుబ్బారాయుడిపై ఎందుకు తీసుకున్నట్లు? ఆయనకు ఏ పదవి లేదనేగా? రాజుపై వేటు వేస్తే ఆయన వైసీపీ ప్రతినిధిగా చెప్పుకోరు. ఇప్పటికీ తాను వైసీపీ ఎంపీగానే ఆయన చెప్పుకుని తిరుగుతున్నారు. ఇది పార్టీకి, నాయకత్వానికి ఇబ్బంది కల్గించే అంశమే. వాస్తవానికి రఘురామ కృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రెండు నెలల క్రితం చెప్పారు. డెడ్ లైన్ కూడా విధించారు. ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత రాజీనామా చేస్తానన్న రాజుగారు ఇప్పటి వరకూ రాజీనామా చేయలేదు.
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో....
అందుకు బీజేపీ నుంచి సానుకూలత రాకపోవడమే కారణమని చెబుతున్నా రఘురామ కృష్ణరాజును ఉపేక్షించడం పార్టీ పరంగా క్షేమం కాదు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. ఈ రెండేళ్లలో పార్టీలోనే ఉండి పార్టీ పరంగా జగన్ ను నేరుగా విమర్శిస్తారు. పార్టీ నిర్ణయాలను ఎండగడతారు. అది జనం ఎలా రిసీవ్ చేసుకున్నారన్నది పక్కన పెడితే.. క్యాడర్, నేతల్లో మాత్రం భయం అనేది ఉండదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నుంచి వెళ్లే వారు కూడా ఎలాంటి ఫియర్ లేకుండా వెళ్లిపోతారు. అందుకే రఘురామ కృష్ణరాజు వేటు వేయడమే మంచిదని పార్టీ సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి?


Tags:    

Similar News