విశాఖ లో 'భూ కబ్జా'లు..?

భూగోళంలో భూమి ఉన్న చోట కబ్జాలు తప్పవు.రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పదు.దందాలు తప్పవు.గొడవలు తప్పవు.

Update: 2023-08-15 16:03 GMT

భూగోళంలో భూమి ఉన్న చోట కబ్జాలు తప్పవు.రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పదు.దందాలు తప్పవు.గొడవలు తప్పవు.పరిస్థితి చెయ్యి దాటితే రక్తపాతమూ జరుగుతుంది.రాజకీయ నాయకులు,వ్యాపారవేత్తలలో సగం మందికి పైగా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్న సంగతి బహిరంగ రహస్యం.గతంలో రాజకీయ నాయకులు,వ్యాపారులు వేరుగా కనిపించేవారు.ఇప్పుడు రాజకీయం,వ్యాపారం,నేరాలు మిశ్రమంగా కొనసాగుతున్నవి. అక్రమంగా,వేగంగా ధనార్జనకు గాను ఉన్న మార్గాలలో రియల్ ఎస్టేట్ రంగమే శ్రేయస్కరంగా భావిస్తుంటారు.ఈ రంగంలో ఇబ్బడి ముబ్బడిగా డబ్బు పోగు చేసుకుంటున్న వారిలో 'భూ దాహం' అపరిమితం.అనంతం.

''దసపల్లా భూముల్లో డెవలపర్‌కు 70 శాతం, యాజమానికి 30 శాతం చొప్పున జరిగిన అగ్రిమెంట్‌పై ప్రశ్నించే మీడియా.. కూర్మన్నపాలెంలో జరిగిన 99:1 అగ్రిమెంట్‌ను ఎందుకు ప్రశ్నించదు?’’ అని కూర్మన్నపాలెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.ఇది ఏడాది కిందటి మాట. “ఇతరుల గురించి మాట్లాడేముందు దసపల్లా భూముల విషయంలో మొదట తనకు అంటిన మురికిని కడుక్కోవాలి'' అని ఎంపీ సత్యనారాయణ విజయసాయిపై కౌంటర్ వేశారు.

అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎంపీల మధ్య జరుగుతున్న భూ కుంభకోణాలు ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేస్తున్నవి. వైసీపీ ఎంపీలే విశాఖలో భూదందాలకు పాల్పడుతున్నారంటూ విపక్షాలు ఆందోళనలు మూడేళ్ళుగా ఆందోళన చేస్తున్నవి. టీడీపీ హయంలో' లులు గ్రూపు'కు కేటాయించిన భూములను కూడా విజయసాయిరెడ్డి తన వారికే ఇప్పించారని గతంలో టీడీపీ,జనసేన పార్టీలు ఆరోపించాయి. .

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి విశాఖ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. వివాదస్పద భూముల సెటిల్మెంట్లు ఎక్కువయ్యాయి.ఈ నేపథ్యంలో భూముల ఆక్రమణలు విచ్చలవిడిగా జరుగుతున్నవి. దసపల్లాకు చెందిన 1196, 1197, 1027, 1028 సర్వే నెంబర్లను 2001లో నిశిద్ద భూముల జాబితా (22ఏ)లో ఉన్నవి. 60 ఎకరాలలో 40 ఎకరాలను వీఎంఆర్‌డీఏ,నౌకాదళం, జీవీఎంసీ అవసరాలకు తీసుకున్నాయి.మరో 5 ఎకరాలను ప్రభుత్వ కార్యాలయాలకు ఇతర అవసరాలకు కేటాయించారు. ప్రస్తుతం 15 ఎకరాల భూమి వివాదంలో ఉన్నది.ఈ 15 ఎకరాల భూమి తమకే చెందుతుందని కమలాదేవి వారసులు కోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో వారికి తీర్పు అనుకూలంగా వచ్చింది.ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం 2014లో సుప్రీంకోర్టుకి వెళ్లినా రాణి కుటుంబీకులకే అనుకూలంగా తీర్పు వచ్చింది.ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడుకు చెందిన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునేందుకే నిషిద్ధ జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.ఈ ఆరోపనుల నేపథ్యంలో విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించారు.ఆ భూముల విషయంలో ఒప్పందం ఎవరు కుదుర్చుకున్నా న్యాయబద్ధంగా 70:30 పద్ధతిలో అగ్రిమెంటు జరిగినట్టు విజయసాయిరెడ్డి అన్నారు.

కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాల భూ వివాదం 1982 నుంచి నడుస్తోంది.ఈ వివాదాన్ని పరిష్కరించాలని 2012లో డీఎల్‌బీ ఉద్యోగులు తనను ఆశ్రయించారని ఎంపీ సత్యనారాయణ తెలిపారు.మొత్తం 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంనలో నిర్మాణాలు చేపట్టి అందులో ఆ 160 మంది ఉద్యోగులకూ ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్లాట్‌ చొప్పున ఇస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.అందుకు వారు తమ వాటాను ఆయనకు 2012లోనే అగ్రిమెంట్‌ చేశారు.గొట్టిపల్లి శోభారాణి, ఆమె కుటుంబీకులకు 14,400 చదరపు అడుగులిచ్చేలా 2018 జనవరిలో ఎంపీ ఒప్పందం చేసుకున్నారు.ఈ నిర్మాణాల అనుమతులను 2019 మార్చి 11న జీవీఎంసీ ఆమోదించిందని చెప్పారు.ఆనాడు వైసీపీ అధికారంలో లేదని ఎంవీవీ చెబుతున్నారు.

సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఎస్పీకి సంబంధించిన భూమిని ఎంపీ ఎంవీవీ కబ్జా చేశారంటూ 2022 మార్చిలో వివాదం రేగింది.ఎస్పీ మధుకు విశాఖ గాయత్రినగర్‌ రోడ్డులో 168 గజాల స్థలాన్ని ఎంపీ కబ్జా చేశారని ఆరోపించిన మధు తర్వాత ఎంపీతో రాజీ చేసుకున్నారు.విశాఖలో 'లులు కన్వెన్షన్ సెంటర్' కోసం పోర్టు బంగ్లా ఎదుట 9.12 ఎకరాల ఏపీఐఐసీ స్థలం కేటాయించారు.అది సరిపోకపోవడంతో సీఎంఆర్ గ్రూపునకు చెందిన విశ్వప్రియ ఫంక్షన్ హాల్ స్థలం 3.4 ఎకరాలను ఇచ్చేందుకు గతంలో నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం 'రివర్స్ టెండరింగ్' పేరుతో లులుతో ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ సంస్థకు ఇచ్చిన భూములకు బదులుగా ప్రభుత్వం సీఎంఆర్‌కు ఇచ్చిన భూముల ఒప్పందాలు రద్దు కాలేదు.ఇదే మరో భూ దందాకు కారణమైందని జనసేన ఆరోపణ.భూ వివాదాలన్నీ వైసీపీ నేతల చుట్టే తిరుగుతున్నవి.

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ భార్య, కొడుకుతో పాటు ఆయన అడిటర్ కిడ్నాప్ రియల్ ఎస్టేట్ వివాదం కారణంగానే జరిగింది.కిడ్నాప్ కథ సుఖాంతమైన తర్వాత ''ఇక విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయన''ని ఎంపీ స్పష్టం చేయడం సీఎం జగన్ పరిపాలనకు మచ్చ.

కాగా దసపల్లా,కూర్మన్నపాలెం,లులు గ్రూపు వివాదాలే కాకుండా హయగ్రీవ,భీమిలి రామానాయుడు స్టూడియోలో లేఅవుట్... వంటి అనేక భూ దందాలు వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నవి.విశాఖలో భూములకు అమాంతం ఊహించని విలువ పెరిగిపోవడంతో ప్రైమ్ ఏరియాలో వంద గజాల స్థలం ఒక కోటి నుంచి రెండు కోట్ల వరకు పలుకుతోంది. లులు గ్రూపు ఒప్పందంలోని వివాదాస్పద భూములు విలువ వందల కోట్లు ఉంటుంది. ‘దసపల్లా’ నగరం నడిబొడ్డున్న ఉండగా, కూర్మన్నపాలెంలోని భూములు కూడా ఖరీదైన ప్రాంతంలో ఉన్నాయి.

విశాఖను పరిపాలన రాజధానిగా చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా అదే సమయంలో విశాఖలో అధికార పార్టీ కీలక నాయకులు,ఎంపీలు,మంత్రులు,ఇతర ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నవి. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లోనే ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నవి.ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ,రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నవి.

(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)

Tags:    

Similar News