వైసీపీ తప్పిదం - తుపానుగా 'చిరు'గాలి !!
రాజకీయాలకు నేను దూరం అయ్యాను కానీ…. నాకు రాజకీయాలు కాదు''! గాడ్ ఫాదర్ ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
''రాజకీయాలకు నేను దూరం అయ్యాను కానీ…. నాకు రాజకీయాలు కాదు''! గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అన్నారు.పది నెలల కిందట ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి.ఆయన మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి రావచ్చునన్న ఊహాగానాలు జరిగాయి.ఆ ఊహాగానాలు 2024 ఎన్నికల్లోపు నిజం కావచ్చు కూడా.ఇదంతా వైసీపీ తప్పిదమే! రాజకీయాల్లో ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడమో లేదా వీలైనంత మేరకు తగ్గించుకుంటూ రావాలన్న లాజిక్ ను జగన్ మిస్సయ్యారు.చంద్రబాబు,పవన్,లోకేశ్ అన్ని వైపులా నుంచి చుట్టుముడుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముఖ్యమంత్రి రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారు.లేకపోతే రాజకీయాలకు దూరంగా చిరంజీవిని కూడా అందులోకి లాగి ఏమి సాధించదలచుకున్నట్టు? ఎప్పుడయినా తమ్ముడు తమ్ముడే ! జగన్ ను గతంలో కొన్ని సందర్భాల్లో చిరంజీవి అభినందించి ఉండవచ్చు.అంత మాత్రాన ఆయన వైసీపీ కార్యకర్త అయిపోరు.జగన్ మద్దతుదారు అయిపోరు.సందర్భానుసారం ఆయా ముఖ్యమంత్రులను ప్రశంసించవలసి వచ్చినప్పుడు ఆ పని చేయడం సరైన వ్యూహమే.తన తమ్ముడ్ని 'పద్మవ్యూహం'లో ఇరుకున పెట్టాలనుకుంటున్న వైసీపీ విషయంలో మెగాస్టార్ మౌనంగా ఎందుకు ఉంటారు? ఎందుకు ఉండాలి ?
ఒక్కోసారి రాజకీయాలలో ప్రాధాన్యం కోసం ఎన్ని కుస్తీలు చేసినా ఫలితం ఉండదు.కొంతమందిని పరిస్థితులే రాజకీయాల్లోకి నెట్టివేస్తాయి.ఊహించని ప్రాధాన్యమూ లభిస్తుంది.మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తర్వాత పార్టీని నడపలేక చేతులెత్తేసి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
రాజకీయాల నుంచి చిరంజీవి తప్పుకున్నారు.కానీ రాజకీయాలు ఆయనను వదలలేదు.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ చిరంజీవి చుట్టే పరిభ్రమిస్తున్నవి.ఇదేమీ ఆయన స్వయంగా కోరుకున్న పరిణామం కాదు.కానీ పరిస్థితులు క్రమంగా మెగాస్టార్ ను మళ్ళీ రాజకీయాల్లోకి నెడుతున్నవి.'బ్రో' సినిమాలో మంత్రి అంబటి రాంబాబు లాంటి క్యారక్టర్ ను పెట్టడం వలన సమస్య ప్రారంభమైంది.ఈ సమస్య రాజకీయ రంగు పులుముకున్నది. చిరంజీవి అనుకూల,వ్యతిరేక శిబిరాలుగా ఏపీ రాజకీయాలు చీలిపోయినవి.
'వాల్తేరు వీరయ్య' సినిమా 200 రోజులు పూర్తయిన సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నేరుగా వైసీపీని తాకాయి.ముఖ్యమంత్రి జగన్ ను ఇంకా గట్టిగా తాకాయి.''హీరోల రెమ్యునరేషన్ సంగతి ప్రభుత్వానికి ఎందుకు?పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయవద్దు.ప్రాజెక్టులు,ప్రజల సమస్యలు,ఉద్యోగాలు... ఇతర అంశాలపై దృష్టి పెడితే ప్రభుత్వాలను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు'' అని ఆయన అన్నారు.ఇందులో తప్పు పట్టడానికి ఏముందని అనుకోవచ్చు.కానీ చిరంజీవి నర్మగర్భంగానే జగన్ పై 'దాడి' చేశారు.తన తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను వైసీపీ నాయకులు,మంత్రులు ఎట్లా దూషిస్తున్నారో,అట్లా కించపరుస్తున్నారో,ఎట్లా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారో... చూస్తున్న చిరంజీవికి 'ఎక్కడో కాలి' ఉంటుంది.అదను చూసి దెబ్బకొట్టారు.ఇది మామూలు దెబ్బ కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు పెద్దఎత్తున విరుచుకుపడుతున్న తీరుతోనే అర్ధమవుతోంది.
అయితే వైసీపీ 'సెల్ఫ్ గోల్' చేసుకుందనే అనుమానాలు కలుగుతున్నవి.ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ''ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేయండి''.. అంటూ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం పట్ల వైసీపీ నాయకులు రగిలిపోతున్నారు.చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం స్పందించడంతో అటు టీడీపీ,ఇటు చిరంజీవి అభిమానులు ఆయనకు మద్దతుగా నిలబడుతున్నారు.
ఇక మాజీ ఎంపీ,సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ రంగంలోకి దిగారు.చిరంజీవికి ఉండవల్లి బాసటగా నిలిచారు.చిరంజీవి శక్తిని తక్కువగా అంచనా వేయొద్దన్నారు.చిరంజీవి బరిలోకి దిగితే వైసీపీకి 'దబిడి దిబిడే'అని కూడా మాజీ ఎంపీ తేల్చి పారేశారు.ఏపీ రాజకీయాలను పూర్తిగా అవపోసన పట్టిన అతి కొద్దిమంది రాజనీతిజ్ఞులలో అరుణ్ కుమార్ ఒకరు.ఆయన ఎప్పుడూ ఎవరినీ అకారణంగా తూలనాడరు.అనవసరంగా నోరు పారేసుకోరు.తనకు ఏది కరెక్టు అనిపిస్తుందో దాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే ఆయన పని.రాజమండ్రి కేంద్రంగా ఉండవల్లి విలేకరుల సమావేశాలు నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ అకారణంగా ఎవరినీ దూషించిన దాఖలాలు లేవు.మాజీ మంత్రులు పేర్ని నాని,కొడాలి నాని,మంత్రులు గుడివాడ అమర్నాథ్,రోజా తదితరులు చిరంజీవిని నానా మాటలూ అంటున్నారు.ఇందులో చిరంజీవిని ఉద్దేశించి 'పకోడీ గాళ్ళు' అనే మాట అతివాదమే.
పవన్ మీది కోపాన్ని చిరంజీవిపై ప్రదర్శించడం ఎట్లా సముచితమవుతుంది?పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్తున్నారు. చిరంజీవి కూడా పవన్ తో కలిస్తే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే ముందుగానే వ్యూహాలు రచిస్తున్నారు. మున్ముందు ఇదే దూకుడును కొనసాగించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. నిన్న మొన్నటివరకూ అన్నయ్య చిరంజీవిని చూసి నేర్చుకోవాలంటూ పవన్ కు బుద్ధులు చెప్పిన వైసీపీ నేతలు అదే చిరంజీవిపై ఫైర్ అవుతుండటం చర్చనీయాంశం.
చిరంజీవి తమవైపు ఉన్నాడని భావించిన వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్‌ను నోటికి వచ్చిన్నట్లు తిడుతుండేవారు. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్ వైపు మొగ్గుచూపితే వైసీపీ నష్టపోతుందనే భయంతోనే చిరంజీవిని తమవైపు ఉన్నాడని ప్రచారం సాగిస్తున్నారు.
బ్రో సినిమా వివాదం ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే అవకాశం లేకపోలేదు.చిరంజీవి పవన్ కోసం నేరుగా రంగంలోకి దిగితే మొత్తం సమీకరణాలు మారిపోనున్నవి.రాజకీయ బలాబలాల్లోనూ పెను మార్పులు సంభవిస్తాయి.'చిరు' గాలి తుపానుగా మారితే జగన్ తట్టుకోవడం కష్టమే!!
(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)