అఖిల పంతం... రిజైన్‌కూ రెడీనా..!

Update: 2018-04-26 11:30 GMT

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాలు మ‌రింత ముదురు తున్నాయి. టీడీపీ నేత‌ల మ‌ధ్య త‌లెత్తిన విభేదాలు ముదిరి పాకాన ప‌డుతున్నాయి. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి వార‌సురాలు భూమా అఖిల ప్రియ రాజ‌కీయాల్లో బా.. గా ముదిరిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నాగిరెడ్డికి రైట్ హ్యాండ్‌గా ప‌నిచేసిన ఏవీ సుబ్బారెడ్డి.. ఆళ్ల‌గ‌డ్డ‌పై క‌న్నేశాడు. దీంతో ఈయ‌న‌పై భూమా అఖిల ప్రియ క‌త్తిక‌ట్టారు. ఆయ‌న త‌న‌కు అడ్డం వ‌స్తున్నార‌ని భావించి తీవ్ర స్థాయిలో విభేదిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఏవీపై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది.

నంద్యాల సీటు విషయంలో......

అస‌లు నంద్యాల ఉప ఎన్నిక‌ల టైంలో త‌న‌కు నంద్యాల సీటు కావాల‌ని సుబ్బారెడ్డి గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టారు. అయితే అప్పుడు చంద్ర‌బాబు స్వ‌యంగా జోక్యం చేసుకుని న్యాయం చేస్తాన‌ని చెప్ప‌డంతో ఆయ‌న కాస్త లేట్‌గా నంద్యాల ఎన్నిక‌ల ప్ర‌చార రంగంలోకి దిగారు. ఇక ఈ ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి వీరి మ‌ధ్య గ్యాప్ తీవ్ర‌మైంది. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన సైకిల్ యాత్ర మ‌రింత వివాదంగా మారింది. ఏవీపై రాళ్ల‌దాడి జ‌ర‌గ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య యుద్ధం తార‌స్థాయికి చేరింది. దీంతో ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రి మ‌ధ్య చాలా సార్లు స‌యోధ్య చేసిన చంద్ర‌బాబు.. ఈ ద‌ఫా గ‌ట్టిగానే వార్నింగ్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అమరావతికి రావాలని......

ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రినీ అమ‌రావ‌తికి రావాల‌ని ఆదేశించారు. అయితే, ఏవీ సుబ్బారెడ్డి అధినేత ఆదేశాల మేర‌కు అమ‌రావ‌తి వ‌చ్చాడు కానీ, అఖిల ప్రియ మాత్రం రాలేదు. అంతేకాదు సుబ్బారెడ్డితో చర్చలకు వెళ్లేదే లేదని మంత్రి అఖిల‌ తేల్చి చెప్తున్నారు. ఇదే విషయంపై ఇవాళ తన నివాసంలో సన్నిహితులతో సమావేశమై చర్చించారు. ఒకవేళ ముఖ్యమంత్రి ఏవీ సుబ్బారెడ్డికే మద్దతిస్తే మంత్రి పదవి వదులుకునేందుకు కూడా వెనుకాడకూడదన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేశారు. ఈ విష‌యం అఖిల స‌న్నిహితుల ద్వారా బ‌య‌ట‌కు లీక్ అయ్యింది. అయితే ఇది ఆమె బెదిరింపుల‌కు దిగుతున్న‌ట్టా ? అని కూడా పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

రాజీనామాకైనా సిద్ధపడాలని.....

అవసరమైతే పార్టీ మారేందుకైనా సిద్ధపడాలన్న వాదన ఈ అంతర్గత సమావేశంలో వ్యక్తమయినట్టు సమాచారం. ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి మొదటి నుంచి కుడిభుజంగా నిలిచిన సుబ్బారెడ్డితో అఖిలప్రియకు అస్సలు పొసగడం లేదు. ఇప్పటికే 2 సార్లు వీరిద్దరినీ కూర్చోపెట్టి మాట్లాడేందుకు ప్రయత్నించారు. రెండుసార్లూ ఏవో కారణాలతో అమరావతికి రాని అఖిలప్రియ ఇవాళ కూడా డుమ్మాకొట్టాలన్న ఆలోచనలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఉదయం సన్నిహితులతో జరిగిన మీటింగ్‌ బట్టి చూస్తే.. అమీతుమీకే ఆమె సిద్ధమైనట్టు కనిపిస్తోంది. క‌ర్నూలు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ట్రై చేస్తున్న పరిస్థితుల్లో, అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి గొడవ చంద్రబాబుకు చికాకులు తెప్పిస్తోంది. ఎవరినీ వదులుకోలేని పరిస్థితుల్లో రాజీమార్గానికి ట్రై చేస్తున్నా, అఖిలప్రియ పంతానికి పోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Similar News