మంత్రి అఖిలప్రియ తీరుతో కర్నూలు జిల్లా టీడీపీ రగులుతోంది. ఇప్పటికే భూమా ఫ్యామిలీకి చంద్రబాబు ఇచ్చిన ప్రయారిటీతో నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. భూమాకు రెండు దశాబ్దాలకు పైగా రైట్ హ్యాండ్‌గా ఉన్న ఏవి.సుబ్బారెడ్డికి మంత్రి అఖిలకు అస్సలు పడడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లో భూమా ఫ్యామిలీని చంద్రబాబు నమ్మినందుకు అఖిలప్రియ రెండు నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్ నాయకులను పక్కన పెట్టేసే వరకు వెళ్లారు.
అఖిలప్రియ తీరుతో......
ఎండీ.ఫరూఖ్, ఏవి.సుబ్బారెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డితో పాటు ఆయన ఫ్యామిలీ వీరితో రెండు నియోజకవర్గాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు అఖిల తీరుతో పార్టీకి దూరమవుతున్నారు. ఇక నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ఇచ్చినందుకు చంద్రబాబు శిల్పా సోదరులను కూడా వదులుకున్నారు. శిల్పా సోదరులు పార్టీ వీడడంతో నంద్యాలతో పాటు శ్రీశైలం నియోజకవర్గాల్లో టీడీపీ బలమైన నాయకులను కోల్పోవాల్సి వచ్చింది.
పార్టీకి నష్టం కలిగించేలా.......
చంద్రబాబు అఖిల కోసం ఇంత చేసినా ఆమె తీరుతో మాత్రం జిల్లాలో పార్టీకి తీరని నష్టం చేస్తోంది. అఖిల తీరుతో వేగలేక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొందరు నేతలు జగన్ పర్యటనలో వైసీపీలోకి కూడా జంప్ చేసేశారు. అక్కడ గంగుల ఫ్యామిలీ స్ట్రాంగ్ అయితే వచ్చే ఎన్నికల్లో అఖిలకు ఎదురు దెబ్బ తప్పదు. అఖిలప్రియ ఎఫెక్ట్ ఇప్పటికే నంద్యాల, ఆళ్లగడ్డకే ఉందని అనుకుంటే ఇప్పుడు జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాలకు కూడా పాకుతోంది. కర్నూలు సిటీ నుంచి అఖిల మామ ఎస్వీ.మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఆయనకు ఆమె బలంగా కొమ్ము కాస్తోంది. ఈ క్రమంలోనే రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్‌తో ఆమెకు వైరం తప్పట్లేదు. కర్నూలు సిటీలో టీడీపీ మంత్రి అఖిల, ఎస్వీ.మోహన్‌రెడ్డిది ఓ వర్గంగాను, ఎంపీ టీజీతో పాటు ఆయన కుమారుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఆశిస్తోన్న టీజీ.భరత్ వర్గాలుగా విడిపోయాయి.
బనగానపల్లెలోనూ.....
ఇక ఇప్పుడు అఖిల బనగానపల్లె నియోజకవర్గంలో కూడా వేలు పెట్టారు. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బిసి.జనార్థన్‌రెడ్డి అఖిలపై తీవ్రంగా రగులుతున్నారు. అక్కడ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న కాటసాని రామిరెడ్డి నంద్యాల ఎమ్మెల్యే అయిన అఖిల సోదరుడు బ్రహ్మానందరెడ్డికి స్వయానా అల్లుడు. అఖిల ఇప్పుడు మంత్రి హోదాలో రామిరెడ్డికి కాంట్రాక్టులు ఇస్తోందట. ఇప్పుడు రామిరెడ్డి అదే డబ్బులతో వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేస్తాడని జనార్థన్‌రెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.ఇక జిల్లాలో సీనియర్ అయిన మంత్రి కేఈ.కృష్ణమూర్తిని కూడా అఖిల పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా చంద్రబాబు భూమా ఫ్యామిలీపై సానుభూతితో ఇంత చేస్తే ఆమె మాత్రం జిల్లా టీడీపీని నిలువునా బ్రష్టు పట్టిస్తున్నారన్న విమర్శలు టీడీపీలోని ఉన్నత వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.