అవంతి అంతంత మాత్రమేనట

విశాఖ జిల్లాలో వైసీపీ మంత్రిగా అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన చిరకాలపు కోరికను వైసీపీలోకి చేరడం ద్వారా తీర్చుకున్నారు. మంత్రిగా బాధ్యతలు అయితే అవంతి శ్రీనివాసరావు స్వీకరించారు. [more]

Update: 2019-10-02 08:00 GMT

విశాఖ జిల్లాలో వైసీపీ మంత్రిగా అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన చిరకాలపు కోరికను వైసీపీలోకి చేరడం ద్వారా తీర్చుకున్నారు. మంత్రిగా బాధ్యతలు అయితే అవంతి శ్రీనివాసరావు స్వీకరించారు. కానీ ఆయన ఆ మేరకు తన పనితీరుని కనబరుస్తున్నారా. ఆయన్ని పనిచేయనిస్తున్నారా అన్నది కూడా ఒకసారి ఆలోచించాల్సిందే. విశాఖ జిల్లాలో అవంతి శ్రీనివాసరావు రాజకీయంగా బలమైన ముద్ర వేసుకున్నారా అంటే లేదని చెప్పాలి. ఆయన ఓమారు ఎమ్మెల్యెగా, మరో మరు ఎంపీగా పనిచేశారు. అవంతి శ్రీనివాసరావు జిల్లా రాజకీయల్లో తనకంటూ ఓ గట్టి వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. పార్టీలు మారి పదవులు అయితే సంపాదించారు. కానీ తన వెంట నిలిచే కొంతమంది బలగాన్ని తయారుచేసుకోలేకపోయారు. అదే ఇపుడు అవంతి శ్రీనివాసరావును బలహీనపరుస్తోందని అంటున్నారు.

ఆయన రాజ్యాంగేతర శక్తిగా….

విశాఖ జిల్లాకు మంత్రి ఎవరు అంటే అవంతి శ్రీనివాసరావు పేరునే చెప్పుకుంటారు. అయితే ఇది సాంకేతికంగా మాత్రమే. అసలు మంత్రి వేరే ఉన్నారట. ఆయనే విజయసాయిరెడ్డి అంటున్నారు. విజయసాయి రాజ్యసభ సభ్యుడు. ఆయనకు ఇక్కడ ఏం పని అంటే ఆయన విశాఖను నోడల్ జిల్లాగా తీసుకున్నారు. దాంతో ఆయనకు విశాఖతో రాజకీయ బంధం ఉంది. అయితే ఆయన ఓ ఎంపీగా అంతవరకే పరిమితం కావాలి కానీ ఏకంగా కలెక్టర్ ఆఫీసులో కూర్చుని సమీక్షలు చేయడమేంటి. అసలు ఆయనకు ఆ అధికారం ఉందా. అలా చేయవచ్చా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విజయసాయిరెడ్డి ఇలా సమీక్షలు చేస్తూంటే పక్కన మంత్రి హోదాలో అవంతి శ్రీనివాసరావు ఉత్సవ‌ విగ్రహంగా కూర్చున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించేంతవరకూ కూడా ఆయనకూ ఆ సంగతి అర్ధం కాలేదేమో. తాను మంత్రిని అని మరచిపోయారేమోనని సెటైర్లు పడుతున్నాయి. పార్టీ పరంగా విజయసాయిరెడ్డి హోదా పెద్దది. ఆయన జగన్ కి సన్నిహితుడు. ఆ గౌరవం అక్కడ ఇవ్వవచ్చు. కానీ అధికారికంగా చూస్తే మంత్రి పక్కన ఆయన కూర్చోవాలి. మరి విజయసాయి ఆ సీటునే ఆక్రమించారని అంటున్నారు.

అందరూ మంత్రులేనా…?

ఇక అవంతి శ్రీనివాసరావు పరిస్థితి ఎలా ఉంది అంటే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు నుంచి అందరూ విశాఖ జిల్లాలో మంత్రులే అయిపోయారు. ఎమ్మెల్యేలు సైతం తనను సంప్రదించకుండా ఎవరి అజెండా వారు డిసైడ్ చేసుకునిపోతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు విశాఖ ఎంపీ ఓ వర్గాన్ని తయారు చేసుకుని తాను అవంతి శ్రీనివాసరావు కంటే ఎక్కువ అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో తలపండిన ద్రోణంరాజు శ్రీనివాస్ సైతం మంత్రి అవంతి శ్రీనివాసరావుని ఖాతరు చేయడంలేదు రూరల్ జిల్లాలో సీనియ‌ర్ ఎమ్మెల్యేలు కన్నబాబు రాజు, గొల్ల బాబూరావు, ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు వంటి వారు అయితే అవంతి శ్రీనివాసరావుని లెక్కపెట్టడంలేదు. అంటే అచ్చెన్నాయుడు ఆరోపించినట్లుగా అవంతి శ్రీనివాసరావు ఉత్సవ విగ్రహంగా మారిపోయారా. ఆయనకు జిల్లా మీద కానీ, పార్టీ మీద కానీ పట్టు లేదా. అంటే అదేనని అంటున్నారు సొంత పార్టీలో కూడా.

Tags:    

Similar News