దీక్ష..ఒక పరీక్ష

Update: 2018-04-20 00:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈవెంట్ మేనేజర్ అనే పేరుంది. ఆయన ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అవ్వాల్సిందే. గోదావరి, కృష్ణా పుష్కరాలను భారీ ఎత్తున జరిపి ఇటు ప్రభుత్వానికి, పార్టీకి మైలేజీ తెప్పించగలిగారు. అలాంటి ఈవెంట్ నే ఈరోజు చంద్రబాబు చేపడుతున్నారు. చంద్రబాబు నేడు దీక్షకు దిగనున్నారు. కొద్దిసేపట్లో ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒకరోజు దీక్షకు కూర్చోనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ దీక్ష చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్మ పోరాట దీక్షను చంద్రబాబు ప్రారంభించనున్నారు.

లక్ష మంది పాల్గొనేలా......

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగుతున్న ఈ దీక్షలో లక్ష మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు డ్వాక్రా సంఘాల సభ్యులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు ఈ దీక్షలో పాల్గొననున్నాయి. ప్రత్యేక హోదా సాధన కోసం చేపడుతన్న ఈ దీక్షను ఐదు కోట్ల ఆంధ్రుల తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేయనున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. చంద్రబాబు తన పుట్టిన రోజు నాడే ఈ దీక్షకు దిగుతుండటం విశేషం. ఆయన పుట్టినరోజుకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టేసి రాష్ట్రం కోసం ఉద్యమించడానికి సిద్ధమయ్యారు. ఒక ముఖ్యమంత్రి దీక్షకు దిగడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం కావడం గమనార్హం.

అన్ని నియోజకవర్గాల్లో.....

ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా దీక్షలో పాల్గొంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఈరోజు దీక్ష ఉద్యమాన్ని నిర్వహించనున్నారు. నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ఈ దీక్ష చేయనున్నారు. 13 జిల్లాల్లో పదమూడు మంది మంత్రులు దీక్షలో పాల్గొంటారు. ఇక దీక్షకు జాతీయ స్థాయిలో ప్రచారం తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చంద్రబాబు పూర్తి చేసుకున్నారు. జాతీయ పార్టీల నుంచి నేతలను కూడా చంద్రబాబు ఆహ్వానించారు. వారు రాకపోతే వారి తరుపున ప్రతినిధులయినా హాజరవుతారు. లేకుంటే వారి సందేశాన్ని దీక్ష శిబిరంలో చదివి విన్పించాలని చంద్రబాబు నిర్ణయించారు.

ప్రతి గ్రామం నుంచి.....

నియోజకవర్గాల్లో జరిగే దీక్షా శిబిరంలో ప్రతి గ్రామం నుంచ ఐదారుగురు తప్పనిసరిగా ఉండాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు. అప్పుడే ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యులను చేసినట్లవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏ నియోజకవర్గంలో దీక్ష ఎలా జరిగిందో నివేదికలను కూడా చంద్రబాబు తెప్పించుకోనున్నారు. ఒకరకంగా ఎమ్మెల్యేలకు ఎన్నికలకు ముందు దీక్ష ఒక పరీక్ష లాంటిదేనని టీడీపీ అధినేత పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఇలా చంద్రబాబు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఈవెంట్ కు తెరలేపాయంటున్నాయి విపక్షాలు. కాని ముఖ్యమంత్రి మాత్రం హోదా సాధన లక్ష్యంగానే పుట్టినరోజు నాడు దీక్షకు దిగుతున్నానని చెబుతున్నారు.

Similar News