జగన్ నుంచి వారిని తప్పించడం ఎలా?

అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల సహకారం అవసరం. అందరి మద్దతు ఉంటేనే అధికారం అందుతుంది. కొన్ని వర్గాలకే పరిమితమైతే అధికారం ఎప్పటికీ అందదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2021-08-04 02:00 GMT

అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల సహకారం అవసరం. అందరి మద్దతు ఉంటేనే అధికారం అందుతుంది. కొన్ని వర్గాలకే పరిమితమైతే అధికారం ఎప్పటికీ అందదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న వర్గాలు క్రమంగా దూరమవుతున్నాయి. ఇది ఆందోళన కల్గించే అంశమే. ఎన్టీరామారావు పార్టీని స్థాపించినప్పుడు అన్ని వర్గాల మద్దతు లభించింది. ఆయనకు కులాలు, మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. ఫలితంగానే ఎన్టీఆర్ తొమ్మది నెలల్లోనే అధికారంలోకి రాగలిగారు. నాడు అండగా ఉన్న వర్గాలన్నీ ఇప్పడు క్రమంగా దూరమయిపోతున్నాయి.

దశాబ్ద కాలం నుంచి….

తెలుగుదేశం పార్టీకి బీసీలు, మైనారిటీలు దశాబ్దకాలం నుంచి మద్దతు గా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి బీసీ సంక్షేమానికి కృషి చేశారు. దీంతో బలమైన బీసీ ఓటు బ్యాంకును ఎన్టీఆర్ యే టీడీపీకి సమకూర్చి పెట్టారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు సారథ్యంలో కూడా బీసీలు అండగానే ఉన్నారు. ఆదరణ వంటి పథకాలతో బీసీలను చంద్రబాబు ఆకట్టుకున్నారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం బీసీలు చంద్రబాబును దెబ్బేశారు. అతిపెద్ద ఓటు బ్యాంకు టీడీపీకి దూరమయిందన్న ఆందోళన చంద్రబాబు కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేస్తుండటంతో ఆ వర్గాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకోవడం కష్టసాధ్యమైన పనే.

అధికారంలోకి వచ్చిన తర్వాత…?

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు బీసీ సంక్షేమాన్ని విస్మరించారు. తన ధ్యాసంతా పోలవరం, అమరావతిపైనే పెట్టారు. బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయలేదు. ఇచ్చిన హమీలను కూడా అమలు పర్చలేకపోయారు. దీంతో బీసీలు ఆగ్రహంతో గత ఎన్నికల్లో దూరమయ్యారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను వదిలిపెట్టడం లేదు. పదవుల భర్తీ లో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్సీ ల ఎంపిక, బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం వంటి వాటితో బీసీలు చంద్రబాబుకు మరింత దూరమవుతారన్న ఆందోళన ఉంది.

తిరిగి ఆకట్టుకునేందుకు…?

ఇక మైనారిటీల పరిస్థితి కూడా అంతే. 2014 లోనే మైనారిటీలు చంద్రబాబుకు దూరమయ్యారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వారు వైసీపీ వైపు మొగ్గు చూపారు. తను అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రెండేళ్ల పాటు మైనారిటీకి మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో విభేదించినా మైనారిటీ లు మాత్రం కరుణించలేదు. దీంతో చంద్రబాబు ఇప్పుడు ఈ రెండు వర్గాలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ పదవుల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎన్నికల హామీల్లోనూ వీరికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరి జగన్ నుంచి వారిని వేరు చేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో? లేదో? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News