చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో రెండేళ్లపాటు ఐపీఎల్ కి దూరమైన టీం. అయితేనేం ఛాంపియన్ ఛాంపియనే. నిషేధం అనంతరం దిగిన వెంటనే విజయాలనే వేటగా మార్చుకుంది. ఒక్కో జట్టును మట్టికరిపిస్తూ నాకౌట్ కు చేరుకుంది. అక్కడ హైదరాబాద్ సన్ రైజర్స్ ను ఓడించి ఫైనల్ కి చేరుకొని ప్రత్యర్థి కోసం ఆకలిగొన్న పులిలా వేచి చూసింది. సమయం వచ్చింది. తిరిగి హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రత్యర్థిగా నిలిచింది. లో స్కోర్ మ్యాచ్ లను సైతం తన చక్కటి బౌలింగ్ పటిమతో నిలబెట్టుకుంటూ వచ్చిన హైదరాబాద్ ఫైనల్ లో చెన్నయ్ సూపర్ కింగ్స్ ధాటికి మరోసారి విలవిల్లాడింది. ఆల్ రౌండ్ ఫెరఫార్మెన్స్ తో ఐ ముచ్చటగా మూడోసారి కప్ ను సగర్వంగా అందుకుని ముద్దాడింది.
హైదరాబాద్ బాగా ఆడినా ...
ముంబాయి వాంఖేడ్ స్టేడియం అభిమానుల కేరింతలతో హోరెత్తింది. ముందు టాస్ ఓడిపోయిన హైదరాబాద్ బ్యాటింగ్ కి రంగంలోకి దిగింది. ఆ టీం ఓపెనర్లు గోస్వామి (5) మంచి ఫామ్ లో వున్న శిఖర్ ధావన్ (26) శుభారంభాన్ని ఇవ్వలేక పోయారు. ఇక వన్ డౌన్ లో దిగిన విలియమ్సన్ (47) రాణించినా చెన్నయి కెప్టెన్ చేసిన అద్భుత స్టంపింగ్ తో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తరువాత బ్రావో (23) యూసఫ్ పఠాన్ (45) నాటౌట్ బ్రాత్ వైట్ (21) దీపక్ (3) జట్టుకు పరుగులు జోడించి 20 ఓవర్లలో మొత్తం 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించారు.
దుమ్ములేపిన వాట్సాన్ ...
ఛాలెంజింగ్ టార్గెట్ ను చెన్నయి వాట్సన్ (117) సూపర్ ఇన్నింగ్స్ తుఫాన్ లా చెలరేగడంతో 18.3 ఓవర్లలోనే నల్లేరుపై బండి నడకలా గెలుపు తీరానికి టీం ను చేర్చాడు. డుప్లెసిస్ (10) 16 పరుగులు టీమ్ స్కోర్ ఉండగానే వెనుతిరిగినా రైనా (32) సపోర్ట్ తో గెలుపు ధీమాను ముందునుంచి నిలబెట్టాడు వాట్సాన్. రైనా అవుట్ అయ్యాక క్రీజ్ లోకి దిగిన అంబటి రాయుడు (16) విన్నింగ్ షాట్ తో ఐపీఎల్ 11 విజేతగా నిలిచింది. ఈ సీజన్ లో వాట్సాన్ రెండో సూపర్ సెంచరీ చేయడం విశేషం. ఆరంభం లాగే ముగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ధోని టీం కప్ ను సగర్వంగా అందుకుని అభిమానుల మనసు మరోసారి దోచుకుంది. ఇక ధోని అనేక రికార్డ్ లను ఈ ఐపీఎల్ లో బద్దలు కొట్టారు. టీమ్ గా ఏడుసార్లు ఫైనల్ చేరిన చెన్నయి టీం మూడు సార్లు కప్ అందుకోవడం వంటి అనేక విశేషాలను సీఎస్కే నెలకొల్పడం విశేషం.