మాస్టారు గొంతు చించుకుంటున్నా.?

విశాఖ జిల్లాలో మాస్టార్ అంటే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పేరు చెబుతారు. ఆయన రాజకీయాల్లోకి రాకపూర్వం హిందీ మాస్టార్ గా పనిచేసేవారు. ఆయన్ని ఏరి కోరి [more]

Update: 2020-01-25 15:30 GMT

విశాఖ జిల్లాలో మాస్టార్ అంటే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పేరు చెబుతారు. ఆయన రాజకీయాల్లోకి రాకపూర్వం హిందీ మాస్టార్ గా పనిచేసేవారు. ఆయన్ని ఏరి కోరి మరీ అన్న ఎన్టీయార్ ఎన్నుకుని పైసా ఖర్చు లేకుండా అనకాపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేను చేశారు. అలా నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో కీలకమైన మంత్రి పదవులు కూడా నిర్వహించారు. ఇక శాసనమండలిలో టీడీపీ పక్ష నేతగా క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ని చేశారు. ఇక సీనియర్ నేతగా ఉన్న దాడి రాజకీయంగా వేసిన కొన్ని తప్పటడుగులే ఇపుడు ఆయన్ని ఇబ్బందులో పెడుతున్నాయి.

క్రెడిబిలిటీ క్వశ్చన్….

దాడి వీరభద్రరావు మంచి మాటకారి. ప్రత్యర్ధుల మీద బాణాలు వేయాలంటే ఆయనే సాటి. సునిశితమైన విమర్శలతో అర్ధవంతంగా మాట్లాడడం ఆయనకే చెల్లు. అటువంటి దాడి 2012లో ఎమ్మెల్సీ పదవీకాలం అయిపోగానే మళ్ళీ తనని నామినేట్ చేయనందుకు బాబు మీద అలిగి సైకిల్ దిగిపోయారు. జైల్లో ఉన్న జగన్ వద్దకు వెళ్ళి మరీ కండువా కప్పుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున తన కుమారుడు రత్నాకర్ ని పోటీ చేయించారు. ఆయన ఓడిన మరుక్షణం వైసీపీని వీడారు. జగన్ ని దారుణంగా తిట్టారు. ఇలా ఇద్దరు నేతలకూ దాడి వీరభద్రరావవు దూరం కావాల్సివచ్చింది.

నమ్మట్లేదుగా….

గత అయిదేళ్ళ కాలంలో దాడి వీరభద్రరావు టీడీపీలో చేరుదామని పెద్ద ప్రయత్నాలే చేశారు. అయితే బాబు ఒక దశలో రెడీ అయినా తన తండ్రిని దారుణంగా విమర్శించిన దాడి వీరభద్రరావుని తిరిగి చేర్ఛుకోవడానికి నారా లోకేష్ బ్రేక్ వేశారని ప్రచారం జరిగింది. ఇక 2019 ఎన్నికల చివరి నిముషం వరకూ సైకిల్ ఎక్కాలన్నదే మాస్టార్ ఆలోచన. ఈసారి కూడా తప్పకుండా చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారని ఆయన అంచనా వేసుకున్నారని అంటారు. అయితే గత్యంతరం లేని స్థితిలో ఆయన వైసీపీలో చేరారు. అయితే ఆయన విషయాలన్నీ తెలిసిన జగన్ కండువా మాత్రమే కప్పారు కానీ పక్కనే పెట్టారు.

మైకు ముందుకొచ్చినా…?

ఈ ఎనిమిది నెలల కాలంలో దాడి ప్రతి నాలుగు రోజులకూ ఒకసారి మైకు అందుకుని మీడియాను తెగ పలకరిస్తున్నారు. నానా హడావుడి చేస్తున్నారు. జగన్ ఏం చేసినా భేష్ అంటున్నారు. జగన్ ని మించిన నేత లేరని కితాబు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి విశాఖ వస్తే వెళ్ళి మరీ కలుస్తున్నారు. మరో వైపు బాబుని నానా మాటలు అంటున్నారు. ఎలా అయినా జగన్ కరుణ సంపాదించేందుకు దాడి వీరభద్రరావు చేయని ప్రయత్నం లేదు.

కంఠ శోషేనా…?

అయితే మాస్టారు ఎంతగా పాఠాలు అప్పచెబుతున్నా కూడా జగన్ మాత్రం వినీ విననట్లే ఉంటున్నారుట. మాస్టార్ కి రాజ్య సభ సీటో, ఆయన కుమారుడికి ఏదైనా పెద్ద పదవో ఇవ్వాలన్నది డిమాండ్. మరి జగన్ ఈ అయారాం, గయారాంలకు కీలక పదవులు ఇవ్వరని వైసీపీలో ఆది నుంచి ఉన్న నేతలు కుండబద్దలు కొడుతున్నారు. మరి దాడి వీరభద్రరావుది కంఠ శోష తప్ప జగన్ ఆలకించేది లేకుండాపోతోందని ఆయన అభిమానులు కూడా వాపోతున్నారు.

Tags:    

Similar News