ఆ సెంటిమెంట్ ఈసారీ ఫలిస్తుందా?

Update: 2018-04-27 18:29 GMT

ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పట్టుకోసం సిద్ధరామయ్య గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఉత్తర కర్ణాటకలో మెజారిటీ వస్తేనే కన్నడనాట రాజ్యమేలడం ఖాయం. ఇందుకోసం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ రెండూ శ్రమిస్తున్నాయి. ఉత్తర కర్ణాటక పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా ఉంది. కొన్నేళ్లుగా ఉత్తర కర్ణాటక అభివృద్ధిని పాలకులు పట్టించుకోలేదు. దీంతో అన్ని పార్టీలపై ఉత్తర కర్ణాటక వాసులు కారాలు మిరియాలు నూరుతున్నారు. వారిని సంతృప్తి పర్చేందుకు అన్ని పార్టీలూ హామీలు గుప్పిస్తున్నాయి. వరాల జల్లులు కురిపిస్తున్నాయి.

ఉత్తర కర్ణాటకలో.....

కర్ణాటకలోని హదరాబాద్ కర్ణాటక, ముంబయి కర్ణాటక ప్రాంతాలను కలిపి ఉత్తర కర్ణాటకగా వ్యవహరిస్తారు. ఉత్తర కర్ణాటకలో ఎక్కువ సీట్లు సాధిస్తే అధికారంలోకి వచ్చినట్లేనన్నది గత ఎన్నికల గణాంకాలను బట్టి తెలుస్తోంది. అందుకే ఈ ప్రాంతంపై పట్టు పెంచుకోవడానికి అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. ఉత్తర కర్ణాటకలో మొత్తం 96 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బెలగావి, విజయపుర,బాగల్ కోట, బీదర్ కొప్పల, కళపురగి, రాయచూరు, యాదగిరి, బళ్లారి, కళపురపి జిల్లాలు ఉత్తర కర్ణాటకలోనివే.

కాంగ్రెస్ వ్యూహమిదే.....

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెలగావి జిల్లాలోని బాదామి నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు. ఇది ఉత్తర కర్ణాటకలో ఉండటంతో ఆయన స్వరం మార్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే తాను బాదామి నుంచి బరిలోకి దిగానని చెబుతున్నారు. ఉత్తర, దక్షిణ కర్ణాటకలను కలిపేందుకే తాను బాదామి నుంచి పోటీ చేస్తున్నట్లు సిద్ధరామయ్య తాజాగా ప్రకటించారు. తాము ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉత్తర కర్ణాటకను అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. రెండు ప్రాంతాల మధ్య అసమానతలను తొలగించేందుకే తాను పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రాహుల్ గాంధీ కూడా పర్యటించారు.

జేడీఎస్ కూడా పట్టు నిలుపుకోవాలని....

ఇక బీజేపీ కూడా ఈ ప్రాంతంపై ఆశలు పెట్టుకుంది. ఇక్కడ ప్రతి జిల్లాలో వీరశైవులు, లింగాయత్ లు ఉన్నారు. 2013లో యడ్యూరప్ప సొంత పార్టీ పెట్టుకోవడంతో బీజేపీ ఇక్కడ దెబ్బతినింది. ఈసారి యడ్యూరప్ప, గాలి జనార్థన్ రెడ్డి కారణంగా ఉత్తర కర్ణాటకలో బలం పెంచుకుంటామని బీజేపీ భావిస్తుంది. ఇక జనతాదళ్ ఎస్ కూడా ఇక్కడ పాగా వేయాలని చూస్తోంది. జేడీఎస్ అధినేత కుమారస్వామి మూడు నెలల ముందే ఈ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని మరీ ప్రచారం చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి టిక్కెట్లు దక్కనివారు జేడీఎస్ లో చేరారు. హైదరాబాద్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు కూడా తమకు ఉపయోగపడుతుందని కుమారస్వామి భావిస్తున్నారు. మొత్తం మీద అందరి దృష్టి ఉత్తర కర్ణాటకపైనే ఉండటం విశేషం. ఇక్కడ ఎవరికి మెజారిటీ వస్తే వారిదే ముఖ్యమంత్రి పీఠమన్న సెంటిమెంట్ ఈసారి కూడా ఫలిస్తుందా? లేదా? చూడాలి మరి.

Similar News